NTV Telugu Site icon

Mohammad Nabi: టీ20ల్లో చెత్త రికార్డ్.. తొలి బ్యాటర్‌గా

Mohammad Nabi Worst Record

Mohammad Nabi Worst Record

Mohammad Nabi Creates Worst Record in T20I: సాధారణంగా బ్యాటర్లకు తమ 50వ మ్యాచ్ లేదా 100వ మ్యాచ్‌ను అనేది ఎంతో ప్రతిష్టాత్మకం. దాన్ని మధురానుభూతిగా మలుచుకునేందుకు.. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. వెంటనే వికెట్ కోల్పోకుండా, పరుగుల వర్షం కురిపించాలని అనుకుంటారు. కొందరు అలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు కూడా. మిగతా వాళ్లు మరీ గొప్పగా రాణించకపోయినా, మోస్తరు పరుగులతోనైనా నెట్టుకొచ్చారు. కానీ.. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ అందుకు భిన్నంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి, చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్.. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీకి 100వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడుతాడని అనుకుంటే, తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో, టీ20లో వందో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన తొలి బ్యాటర్‌గా నబీ తన ఖాతాలో చెత్త రికార్డ్‌ను వేసుకున్నాడు. అలాగే, నబీ కొంతకాలం నుంచి సరిగ్గా రాణించడం లేదు కూడా! టీ20ల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ చూసుకుంటే, నబీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. వరుసగా 5, 9, 6, 5, 0, 8, 1, 0 పరుగులకే ఔటయ్యాడు. అందులో రెండు గోల్డెన్ డక్స్ ఉండటం గమనార్హం.

ఇకపోతే.. సూపర్ 4 దశలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిపోయిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. పాక్‌పై ఆఫ్ఘన్ గెలిస్తే, భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ.. ఆఫ్ఘన్ ఓడిపోవడంతో భారత్ ఇంటి దారి పట్టక తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు.. పాక్ బౌలర్ల ధాటికి భారీ పరుగులు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి, కేవలం 129 పరుగులు చేసింది ఆఫ్ఘన్. ఆ తర్వాత లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పాక్‌కు ఆఫ్ఘన్ బౌలర్లు గట్టి పోటీనే ఇచ్చారు. ముచ్చెమటలు పట్టించారు. చివరిదాకా ఊపిరి ఆడనివ్వకుండా చేశారు. ఒకానొక సమయంలో ఆఫ్ఘన్ విజయం తథ్యమని అంతా అనుకున్నారు. కానీ, ఎలాగోలా పాక్ నెట్టుకొచ్చేసింది. 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో.. పాక్ ఫైనల్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.