Mitchell Starc Creates New Test Cricket History: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో డార్విన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో షాద్మన్ ఇస్లామ్‌ను ఔట్ చేయడంతో స్టార్క్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడి టెస్టు వికెట్ల సంఖ్య 434కు చేరింది. దీంతో శ్రీలంక దిగ్గజం రంగనా హెరాత్‌ను అధిగమించి.. నంబర్ 1 లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు.
అంతకుముందు ఈ రికార్డు రంగనా హెరాత్ పేరిట ఉండేది. హెరాత్ తన టెస్టు కెరీర్‌లో 433 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ ఇప్పుడు 434 వికెట్లతో అతడిని వెనక్కి నెట్టాడు. పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ 414 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి 362 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ 355 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 348 వికెట్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ 317, మిచెల్ జాన్సన్ 313, జహీర్ ఖాన్ 311, డెరిక్ అండర్‌వుడ్ 297 వికెట్లతో టాప్ 10లో ఉన్నారు.
మిచెల్ స్టార్క్ ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో అగ్రస్థానానికి చేరుకున్నప్పటికీ.. అతడి తదుపరి లక్ష్యం టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించడం. ప్రస్తుతం 439 వికెట్లతో డేల్ స్టెయిన్ పదో స్థానంలో ఉన్నాడు. మరో ఆరు వికెట్లు పడగొడితే.. స్టార్క్ ఆ స్థానాన్ని కూడా సొంతం చేసుకోనున్నాడు. స్టార్క్ తన వేగం, స్వింగ్, బౌన్స్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో అత్యధిక వికెట్ల రికార్డు అతడి ఖాతాలో చేరింది.
ఈ వికెట్‌తో మిచెల్ స్టార్క్ భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ కపిల్ కూడా తన టెస్టు కెరీర్‌లో 434 వికెట్లు తీశాడు. అయితే స్టార్క్ ఈ ఘనతను కపిల్ కంటే 25 మ్యాచ్‌లు ముందే సాధించడం విశేషం. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రధాన పేస్ ఆయుధంగా ఎన్నో ఏళ్లుగా స్టార్క్ కొనసాగుతున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్‌లతో పాటు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాడు. ఇప్పుడు ఈ అరుదైన టెస్టు రికార్డుతో తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.

