NTV Telugu Site icon

Matthew Hayden: పరాగ్ అలా చేయడం కరెక్ట్ కాదు

Hayden On Parag Catch

Hayden On Parag Catch

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా స్టోయినిస్ క్యాచ్ పట్టిన తర్వాత రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించిన తీరుపై మ్యాథ్యూ హేడెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు సంయమనంతో వ్యవహరించాలని సూచించిన హేడెన్.. అతడు సంబరాలు చేసుకున్న విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అసలేం జరిగిందంటే.. 19వ ఓవర్‌లో మెక్‌కాయ్ బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ భారీ షాట్ కొట్టగా.. రియాన్ క్యాచ్ అందుకున్నాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్టు కనిపించడంతో అది నాటౌట్‌గా తేలింది.

ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మరోసారి స్టోయినిస్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈసారి బంతి గాల్లోకి లేవడం వల్ల పరాగ్ అలవోకగా క్యాచ్‌ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే బంతి నేలను తాకలేదన్నట్టుగా, బంతిని నేలకు కొడుతూ పరాగ్ సంబరాలు చేసుకున్నాడు. ఈ విషయంపైనే ఈ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా ఉన్న మ్యాథ్యూ హేడెన్ స్పందిస్తూ.. పరాగ్ అలా చేయడం కరెక్ట్ కాదన్నాడు. క్రికెట్ అనేది సుదీర్ఘమైన గేమ్ అని, ఇందులో భాగంగా ఎన్నో జ్ఞాపకాల్ని పొందుపరుచుకుంటామని, విధిని ఎప్పుడూ ప్రలోభ పెట్టకూడదని అన్నాడు. ఎందుకంటే.. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకే తగులుతుందని, కాబట్టి పరాగ్ సంయమనం పాటించాలని హేడెన్ పేర్కొన్నాడు.

అటు.. సోషల్ మీడియాలోనూ పరాగ్ చేసుకున్న సంబరాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరాగ్ మరీ అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే, మరికొందరు అతడ్ని సమర్థిస్తున్నారు. ఇది కేవలం ఆటలో భాగమేనని, ఈమాత్రం దానికి అతడ్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని, చాలామంది ఇంతకన్నా వెటకారంగా వ్యవహరించిన సందర్భాలున్నాయని చెప్తున్నారు. కాగా.. ఈ సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన పరాగ్, 154 పరుగులు సాధించడంతో పాటు 13 క్యాచ్‌లు పట్టుకున్నాడు.