IPL 2023: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుంటాయి. సీఎస్‌కే విజయాల్లో ధోనీ, ముంబై విజయాల్లో రోహిత్‌లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. అయితే గత సీజన్‌లో ఈ రెండు జట్లు చతికిలపడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. దీనికి కారణం నాయకత్వం. గత ఏడాది ధోనీ నాయకత్వ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. అయితే ఈ మార్పు సీఎస్‌కే విజయాలపై ప్రభావం చూపింది. వరుసగా మ్యాచులు ఓడిపోతూ వచ్చింది. దీంతో జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ ధోనీకే సీఎస్‌కే యాజమాన్యం పగ్గాలు అప్పగించింది. ఆ తర్వాత గాయంతో జడేజా ఈ టోర్నీకి దూరమయ్యాడు. చివరకు సీఎస్కే జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Read Also: Rahul Dravid: ఆ పదాన్ని పలకలేక.. గట్టిగా నవ్విన టీమిండియా కోచ్ ద్రవిడ్
అయితే ఈ ఏడాది కెప్టెన్సీ మార్పు ప్రభావం సీఎస్‌కే విజయాలపై ఎఫెక్ట్ చూపించడంతో వచ్చే ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎవరు కెప్టెన్సీ చేస్తారనే ప్రశ్న అభిమానులను కలవరపరుస్తోంది. ఈ ప్రశ్నకు తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ సమాధానం చెప్పారు. వచ్చే ఏడాది కూడా ధోనీనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఆయన స్పష్టం చేశారు. తన మాటలో ఎలాంటి మార్పూలేదు. అసలు కెప్టెన్సీ మార్పు ఉంటుందని తాము ఎప్పుడు చెప్పామని ప్రశ్నించారు. ధోనీ కూడా దీని గురించి గతంలో మాట్లాడుతూ.. చెన్నైలో చివరగా ఆడి అభిమానులకు ధన్యవాదాలు చెప్పకుండా తప్పుకోవడం సరికాదన్నాడు. కాగా 2023లో మాత్రం మళ్లీ గట్టి పోటీ ఇవ్వాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మంచి సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా కెప్టెన్ బాధ్యతలను ధోనీకే కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
