Lionel Messi Announces Qatar 2022 Will Be His Last FIFA World Cup: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఏడాది ఖతార్‌లో జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్ తన చివరి ఆట అని, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని కుండబద్దలు కొట్టాడు. తాను శారీరకంగా బలంగానే ఉన్నప్పటికీ.. ఫుట్‌బాల్ క్రీడకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నానని బాంబ్ పేల్చాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నా. వరల్డ్‌కప్ వచ్చేదాకా ఒక్క రోజుని లెక్క పెట్టుకుంటూ వస్తున్నాను. నా కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్‌కప్ కావడంతో.. అది ఎలా పని చేస్తుందన్న ఆందోళన నాలో ఉంది. ఈ వరల్డ్‌కప్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈసారి మాకంటే మెరుగైన జట్లు ఈ వరల్డ్‌కప్‌లో పోటీ పడుతున్నాయి కాబట్టి.. మ్యాచ్‌లన్నీ కఠినంగా ఉండబోవడం ఖాయం’’ అని చెప్పాడు.
కాగా.. 35 ఏళ్ళ ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు ఐదోసారి వరల్డ్‌కప్ పోటీల్లో పాల్గొనబోతున్నాడు. అర్జెంటీనా తరఫున ఆడుతూ 90 గోల్స్ చేసిన మెస్సీ.. బార్సిలోనా తరఫున ఏకంగా 474 గోల్స్ చేశాడు. 2004 నుండి 2021 వరకు ఈ జట్టు కోసం అతడు 520 మ్యాచ్‌లు ఆడాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతోన్న మెస్సీ.. 2006, 2010, 2014, 2018 వరల్డ్‌కప్ పోటీల్లో ఆడాడు. 13 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్ బరిలోకి దిగిన ఈ ఆటగాడు.. 2004లో బార్సిలోనా క్లబ్‌లో సభ్యుడిగా చేరాడు. అప్పటినుంచే తన కెరీర్‌ని విజయవంతంగా సాగించాడు. ఇతను 2004-05 అర్జెంటీనా అండర్-20 జట్టులో 14 గోల్స్ చేసి చరిత్ర సృష్టించాడు. 2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న మెస్సీ.. అదే టోర్నీలో గోల్డెన్ బాల్, గోల్డెన్ షూను తొలిసారి కైవసం చేసుకున్నాడు. 2008 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
