LA Olympics 2028: ఒలింపిక్స్‌కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్‌వన్‌గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!

  • 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మళ్లీ ఒలింపిక్స్‌లో చోటు
  • ఒలింపిక్స్‌కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం
  • ర్యాంకింగ్స్‌లో విఫలమైతే మరో అవకాశం
Team India Olympics Qualification

Team India Olympics Qualification

Team India Men Team 2028 Olympics Qualification: 128 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్‌కు మళ్లీ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో తలా ఆరు జట్లు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత పురుషుల జట్టు ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించాలి? అనే అంశంపై స్పష్టత వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించిన అర్హత విధానం ప్రకారం టీమిండియాకు రెండు మార్గాలు ఉన్నాయి.

ఆసియాలో అగ్రస్థానమే లక్ష్యం:

టీమిండియా నేరుగా లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే.. 2026 డిసెంబర్ 31 నాటికి ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో ఆసియా ఖండంలో అత్యున్నత స్థానంలో నిలవాలి. ఆసియా నుంచి అత్యుత్తమ ర్యాంక్ ఉన్న జట్టుకు నేరుగా ఒలింపిక్ బెర్త్ లభిస్తుంది. అలాగే ఆఫ్రికా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి కూడా అగ్రస్థానంలో నిలిచిన జట్లకు ఒక్కో కోటా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం నాలుగు జట్లు నేరుగా ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక ఒలింపిక్స్ ఆతిథ్య దేశమైన అమెరికాకు పురుషులు, మహిళల విభాగాల్లో ఒక్కో స్థానం దక్కనుంది. అయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కనీసం ఒక్కసారైనా టాప్-15లో ఉండాలనే షరతు ఉంది.

ర్యాంకింగ్స్‌లో విఫలమైతే మరో అవకాశం:

ఒకవేళ భారత్ 2026 చివరి నాటికి ఆసియాలో నంబర్‌వన్ జట్టుగా నిలవలేకపోతే మరో అవకాశం ఉంటుంది. టీమిండియా 2027లో జరిగే ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ప్రపంచంలోని అర్హత సాధించని అత్యుత్తమ ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో చివరి బెర్త్ దక్కుతుంది. ఇలా మొత్తంగా ఆరు బెర్తులు ఖాయం అవుతాయి.

ప్రతి టీ20 మ్యాచ్ కీలకమే:

లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కేవలం ఆరు జట్లకే అవకాశం ఉండటంతో 2026లో జరిగే ప్రతి ద్వైపాక్షిక టీ20 సిరీస్, అంతర్జాతీయ టోర్నమెంట్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ప్రతి విజయం ఐసీసీ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భారత జట్టు ప్రతి మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆసియా ప్రత్యర్థులపై మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా నేరుగా ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడమే భారత జట్టు ప్రధాన లక్ష్యం.

ఒలింపిక్స్ లక్ష్యంగా టీమిండియా:

టీ20 ప్రపంచకప్ విజయాల తర్వాత ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్న టీమిండియాకు ఇప్పుడు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ మరో పెద్ద లక్ష్యంగా మారింది. 2026 ముగిసే నాటికి ఆసియాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటే.. నేరుగా ఒలింపిక్ వేదికపై అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే 2027 గ్లోబల్ క్వాలిఫయర్‌లో చివరి టికెట్ కోసం పోరాడాల్సి ఉంటుంది.

భిన్నంగా మహిళల అర్హత ప్రక్రియ:

మహిళల విభాగంలో అర్హత ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 2026 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ స్టాండింగ్స్ ఆధారంగా నాలుగు ఖండాల నుంచి అత్యుత్తమ జట్లకు నేరుగా ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా (ఓషియానియా), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా), ఇంగ్లండ్ (యూరప్) జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా ఖండం నుంచి భారత మహిళల జట్టు కూడా అర్హత సాధించింది. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకోకపోయినా.. టోర్నీలో పాల్గొన్న ఆసియా జట్లలో అత్యుత్తమ స్థానంలో నిలవడంతో టీమిండియాకు బెర్త్‌ దక్కింది.