Site icon NTV Telugu

IPL 2022: రెచ్చిపోయిన రసెల్.. కోల్‌కతా ఖాతాలో రెండో విజయం

Andi Russell

Andi Russell

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో రబాడ (15) 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), ధావన్ (16), లివింగ్ స్టోన్ (19), షారుఖ్ ఖాన్ (0), రాజ్ బవా (11) విఫలమయ్యారు.

అనంతరం 138 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు కూడా ఆరంభంలో ఇబ్బంది పడింది. వెంకటేష్ అయ్యర్ (3) స్వల్ప స్కోరుకే వెనుతిరగ్గా.. నితీష్ రానా డకౌట్ అయ్యాడు. రహానె (12) కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. శ్రేయస్ అయ్యర్ (26) కాసేపు క్రీజులో ఉన్నాడు. అయితే నాలుగు వికెట్లు పడ్డ అనంతరం శ్యామ్ బిల్లింగ్స్ (24 నాటౌట్)తో కలిసి ఆండీ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ లాగేసుకున్నాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచి మరో 5.3 ఓవర్లు ఉండగానే జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో కోల్‌కతాకు ఇది రెండో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Exit mobile version