Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!

Jay Shah Journey

Jay Shah Journey

Jay Shah Journey: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి నియమితులయ్యారు. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 ఆగస్టు 27న తొలిసారి ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన షా.. ఇప్పుడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా.. భారత క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. 2009లో అహ్మదాబాద్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్‌తో తన పరిపాలనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా జై షా బాధ్యతలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం అభివృద్ధిలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. 2019 అక్టోబర్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన షా.. ఆ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఆయన పదవీకాలంలో భారత క్రికెట్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల ఒప్పందం భారీ స్థాయికి చేరుకుంది. 2023-27 కాలానికి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కులు రూ.48,390.5 కోట్లకు అమ్ముడయ్యాయి. 2023లో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కావడం కూడా భారత క్రికెట్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

క్రికెటర్ల సంక్షేమానికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు జై షా హయాంలో అమల్లోకి వచ్చాయి. భారత పురుష, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజుల విధానాన్ని తీసుకురావడంతో పాటు దేశవాళీ క్రికెట్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ పరిపాలనలోనూ జై షా తనదైన పాత్ర పోషించారు. 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 2022లో ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2024 ఆగస్టులో ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఇప్పుడు రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆయన అంతర్జాతీయ క్రికెట్ పరిపాలనలో మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్న జై షా ముందు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించడం, మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించడం, అసోసియేట్ సభ్య దేశాలకు మెరుగైన అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ పోటీలను బలోపేతం చేస్తూ.. ఆటకు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు కల్పించడం జై షా తదుపరి పదవీకాలంలో ప్రాధాన్యత సంతరించుకోనుంది.