Jay Shah Reappointed ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఎన్నికయ్యారు. రెండోసారి కూడా ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికయ్యారు. ఇంగ్లండ్, జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు అసోసియేట్ సభ్య దేశాల క్రికెట్ ప్రతినిధులు జై షా నాయకత్వానికి మద్దతు తెలిపారు. ప్రపంచ క్రికెట్ కీలక మార్పుల దశలో ఉన్న సమయంలో ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐసీసీ బోర్డు సమావేశాలు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
2024 ఆగస్టు 27న తొలిసారి ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా.. అదే ఏడాది డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్ల వయసులో ఈ పదవిని అందుకోవడం ద్వారా ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా జై షా గుర్తింపు పొందారు. జై షా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న సమయంలో ప్రపంచ క్రికెట్‌కు కీలక పరిణామాలు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశించనుంది. శతాబ్దానికి పైగా విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం ఈ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెంచే అవకాశంగా భావిస్తున్నారు. అయితే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే నిర్ణయం జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టకముందే ఖరారైంది.
మహిళా క్రికెట్ అభివృద్ధి, అసోసియేట్ సభ్య దేశాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ పోటీలను బలోపేతం చేయడం, క్రికెట్లో పారదర్శకతను కాపాడటం, క్రీడకు స్థిరమైన వాణిజ్య అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై ఐసీసీ దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణతో పాటు సంప్రదాయ క్రికెట్ విలువలను కాపాడటం కూడా జై షా ముందున్న కీలక సవాళ్లలో ఒకటి. జై షా రెండోసారి ఎన్నిక కావడంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది కీలక సమయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రాధాన్యత, పోటీతత్వం తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెట్ సంప్రదాయాలను కాపాడుకుంటూనే కొత్త ప్రేక్షకులు, సాంకేతిక ఆవిష్కరణలు, మారుతున్న వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
తనపై నమ్మకం ఉంచిన ఐసీసీ బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్ బాధ్యతలు తనకు గౌరవంతో పాటు గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన దశలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఈ క్రీడను పరిచయం చేసే అవకాశం లభిస్తుందని, యువతను క్రికెట్ వైపు ఆకర్షించవచ్చని తెలిపారు. అభిమానులు, ఆటగాళ్లు, వాణిజ్య భాగస్వాములు సహా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.

