Site icon NTV Telugu

Jammu and Kashmir History: జమ్మూ కాశ్మీర్ చరిత్ర.. 65 ఏళ్ల తర్వాత విజయం!

Jammu And Kashmir History

Jammu And Kashmir History

జమ్మూ కాశ్మీర్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. దేశీయ దిగ్గజం ఢిల్లీపై రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో గ్రూప్ డి మ్యాచ్‌లో ఢిల్లీని 7 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ ఓడించింది. ఆరు దశాబ్దాల తర్వాత విజయం దక్కడంతో ప్లేయర్స్ మైదానంలోనే ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పరాస్ డోగ్రా, అకిబ్ నబీ, కమ్రాన్ ఇక్బాల్, వంష్ శర్మలు జమ్మూ కాశ్మీర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ చారిత్రాత్మక విజయంతో జమ్మూ కాశ్మీర్ ఎలైట్ గ్రూప్ Dలో రెండవ స్థానానికి చేరుకుంది. ముంబై అగ్రస్థానంలో ఉంది.

179 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు కూడా. 147 బంతుల్లో 133 పరుగులు చేసిన ఇక్బాల్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో కెప్టెన్ డోగ్రా 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 55 పరుగులు కాగా.. చివరి రోజు ఇక్బాల్ జట్టును విజయపథంలో నడిపించాడు. మరో ఎండ్‌లో వాన్ష్ శర్మ అతనికి మద్దతు ఇచ్చాడు. 60 బంతుల్లో ఎనిమిది పరుగులు చేశాడు కానీ.. చాలా సేపు క్రీజులో పాతుకుపోయాడు. ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో వాన్ష్ అవుట్ అయ్యాడు. ఇక్బాల్ నిలకడగా ఆడుతూ జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

Also Read: Prabhas: 23 ఏళ్లు.. ట్రెండింగ్‌లో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’!

నవంబర్ 8న జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ డోగ్రా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అకిబ్ నబీ ఐదు వికెట్లు (5/35) పడగొట్టాడు. దాంతో ఢిల్లీ 69 ఓవర్లలో 211 పరుగులకే పరిమితం అయింది. ఆయుష్ బడోని, ఆయుష్ దోసేజా, సుమిత్ మాథుర్ అర్ధ సెంచరీలు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో జమ్మూ కాశ్మీర్ 310 రన్స్ చేసింది. డోగ్రా (106)సెంచరీ చేయగా.. అబ్దుల్ సమద్ (85) హాఫ్ సెంచరీ చేశాడు. సిమర్జీత్ సింగ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 277 పరుగులకు ఆలౌట్ అయింది. బడోని, దోసేజా అర్ధ సెంచరీలు సాధించారు. వంశ్‌రాజ్ ఆరు వికెట్లు పడగొట్టి ఢిల్లీ బ్యాటర్లను ఆటాడుకున్నాడు. లక్ష్యాన్ని జమ్మూ కాశ్మీర్ మూడు వికెట్స్ కోల్పోయి ఛేదించింది.

Exit mobile version