Sunil Gavaskar: ఐపీఎల్ కోసం.. పాకిస్తాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన విషయంపై సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఫ్రాంచైజీ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇంగ్లాండ్‌లో నిర్వహించే ఫ్రాంచైజీ టోర్నమెంట్ ది హండ్రెడ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో, సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సుమారు రూ.2.34 కోట్లుకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు Sun Group యాజమాన్యంలో ఉంది. ఇదే సంస్థ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని Sunrisers Hyderabad జట్టును కూడా నిర్వహిస్తోంది.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఎందుకు అన్న ప్రశ్నలు లేవనెత్తారు. వేలం సమయంలో హాజరైన ఫ్రాంచైజీ సీఈవో కార్య మారన్ కూడా విమర్శలకు గురయ్యారు.
గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ అంశంపై తన కాలమ్‌లో స్పందించిన సునీల్ గవాస్కర్, గత కొన్ని సంవత్సరాల్లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే ఇటువంటి ప్రతిచర్య సహజమని పేర్కొన్నారు. 2008లో జరిగిన 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లను Indian Premier League లో ఆడనివ్వలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే 2019లో జరిగిన Pulwama attack వంటి ఘటనలు భారతదేశంలో ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేశాయని తెలిపారు. భారత యాజమాన్యంలో ఉన్న జట్టు పాకిస్తాన్ ఆటగాడికి చెల్లించే డబ్బు అక్కడ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుందని, ఆ నిధులను ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశముందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారత యజమాని ఒక పాకిస్తాన్ ఆటగాడికి డబ్బు చెల్లిస్తే, అది పరోక్షంగా భారత సైనికులు లేదా పౌరులపై ప్రభావం చూపే వ్యవస్థకు నిధులు సమకూర్చినట్టే అవుతుంది. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?” అని ఆయన ప్రశ్నించారు.
జట్టు స్పందన
కాగా, ఈ వివాదం నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక X (ట్విట్టర్) ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. తరువాత విమర్శలు తగ్గిన తర్వాత మళ్లీ యాక్టివేట్ చేశారు. జట్టు కోచ్ Daniel Vettori మాట్లాడుతూ మరో పాకిస్తాన్ స్పిన్నర్ Usman Tariq ను కూడా జట్టు పరిశీలనలో ఉంచినట్టు తెలిపారు. గవాస్కర్ వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్లీ చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం సరైనదా కాదా అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
