NTV Telugu Site icon

Heinrich Klaasen Stumping: ఫాస్ట్ బౌలింగ్‌లో ‘క్లాసెన్’ మెరుపు స్టంపింగ్.. ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే! వీడియో వైరల్

Heinrich Klaasen Stumping

Heinrich Klaasen Stumping

Shikar Dhawan was stumped brilliantly by Heinrich Klaasen: క్రికెట్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్స్ స్టంపింగ్ చేయడం మాములే. స్పిన్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి.. స్టంపింగ్ చేస్తుంటారు. ఫాస్ట్‌ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా.. వికెట్‌ కీపింగ్‌ చేయడం చాలా అరుదు. అందులోనూ స్టంపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీపర్ క్లాసెన్ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌.. ఇన్నింగ్స్ ఆరంభంలో స్వింగ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. భువీ స్వింగ్‌ను ఎదురుకునేందుకు పంజాబ్‌ కెప్టెన్ శిఖర్ ధావన్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి షాట్‌లు ఆడాడు. ఇది గమనించిన సన్‌రైజర్స్‌ సారథి ప్యాట్‌ కమ్మిన్స్‌.. కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా ఉండమని సూచించాడు. ఇన్నింగ్స్ ఇదో ఓవర్ నాలుగో బంతిని భువీ సందించగా.. గబ్బర్ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి షాట్‌ ఆడాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాలేదు. గంటకు 140 కిమీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్‌.. మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ధావన్ సహా అందరూ షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!

ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసిన హెన్రిచ్‌ క్లాసెన్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘క్లాసెన్.. నువ్ సూపర్’, ‘ఎంఎస్ ధోనీని గుర్తు చేశావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అప్పుడప్పుడు ఫాస్ట్‌ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి కీపింగ్‌ చేసేవాడు. భువనేశ్వర్‌ కుమార్‌, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్, దీపక్ చహర్ బౌలింగ్‌ వేసినపుడు మహీ స్టంప్స్‌కు దగ్గరగా ఉండేవాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 2 పరుగుల తేడాతో గెలిచింది.

Show comments