NTV Telugu Site icon

SRH vs GT: గుజరాత్‌తో హైదరాబాద్ ఢీ.. ప్లేఆఫ్స్‌పై సన్‌రైజర్స్‌ గురి!

Srh Ipl 2024

Srh Ipl 2024

SRH vs GT IPL 2024 Prediction: ఐపీఎల్‌ 2024లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఉప్పల్‌ మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఒక్క పాయింట్‌ మాత్రమే చాలు. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది.

గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్‌-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది. మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సన్‌రైజర్స్‌ను సొంతగడ్డపై అడ్డుకోవడం గుజరాత్‌కు సవాలే. మే 8న ఉప్పల్‌లో లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ సాధించిన సంగతి తెలిసిందే. వారం విరామం తర్వాత మరింత ఉత్సాహంతో ఆడనున్న సన్‌రైజర్స్‌.. గుజరాత్‌పైనా చెలరేగేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన గుజరాత్‌.. విజయంతో లీగ్‌ను ముగించాలని చూస్తోంది.

Also Read: RR vs PBKS: రాజస్థాన్పై పంజాబ్ గెలుపు..

ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే.. సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డితో పాటు షాబాజ్‌ అహ్మద్‌, అబ్దుల్ సమద్‌ దూకుడు కొనసాగించాల్సి ఉంది. బౌలింగ్‌లో టీ నటరాజన్‌, ప్యాట్ కమిన్స్‌, భువనేశ్వర్‌ కుమార్‌తో కూడిన పేస్‌ త్రయం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆరంభంలో భువీ స్వింగ్ బౌలింగ్‌తో వికెట్స్ పడగొడుతుంటే.. నటరాజన్‌, కమిన్స్‌ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎలా చెలరేగుతారో చూడాలి. ఈ సీజన్‌లో గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఇరు జట్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌ గెలిచింది.