RCB vs CSK Rain Prediction in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే.. ఇరు జట్లకు విజయం ఎంతో అవసరం. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. బెంగళూరుకు 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. భారీ తేడాతో గెలిస్తేనే బెంగళూరుకు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది చెన్నైకి కలిసి రానుండగా.. బెంగళూరుకు నిరాశ కలిగించనుంది.
బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. బెంగళూరులో నేటి వాతావరణంపై ఆక్యూవెదర్ అంచనా వేసింది. దీని ప్రకారం.. మ్యాచ్ జరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ న్యూస్ బెంగళూరు అభిమానులకు ఊరటనిచ్చేదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దైనా, ఓడినా.. ఆర్సీబీ ఇంటిముఖం పట్టడం ఖాయం. ఒకవేళ చెన్నై 18 పరుగుల్లోపే ఓడిపోయినా.. ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటికే బెంగళూరులో యెల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలో బెంగళూరులో వాతావరణం ఎలా ఉండనుందో చూద్దాం.
శనివారం సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలు 87 శాతంగా ఉన్నాయని ఆక్యూవెదర్ అంచనా వేసింది. రాత్రి 7 గంటలకు వాతావరణం సాధారణ స్థితికి వస్తుందట. ఆ సమయంలో చిరు జల్లు పడే అవకాశం 34 శాతంగా ఉందట. రాత్రి 8 గంటల నుంచి 10 వరకు ఇదే పరిస్థితి ఉండనుందట. ఆకాశం మబ్బులుపట్టి ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ. చిరు జల్లులు పడినా.. మ్యాచ్ ఆగిపోయేంత స్థాయిలో ఉండకపోవచ్చు. అయితే రాత్రి 11 గంటలకు వర్షం పడుతుందని ఆక్యూ వెదర్ వెల్లడించింది. బెంగళూరులో శుక్రవారం వర్షం పడింది. ఈరోజు ఉదయం కూడా వరణుడు పలకరించాడు. ప్రస్తుతం అయితే అక్కడ ఆకాశం మేఘావృతం అయింది.
Also Read: Rohit Sharma: తర్వాత ఏంటి? అని అడిగితే.. రోహిత్ ఊహించని సమాధానం చెప్పాడు!
ఒకవేళ చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడినా.. మైదానాన్ని సిద్ధం చేసేందుకు సబ్‌ఎయిర్ సిస్టమ్ ఉంది. భారీ వర్షం కురిసినా.. అరా గంటలో మైదానం సిద్దమవుతుంది. దాంతో మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే.. 10.30 కల్లా మైదానం సిద్ధంగా ఉండాలి. అదీ సాధ్యం కాకపోతే అప్పుడు మ్యాచ్ రద్దవుతుంది. వరణుడు కరుణిస్తాడా?, ఎవరు ప్లేఆఫ్స్‌కు వెళుతారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.