RCB Coach Mike Hesson on DC: ఈరోజు తమను ఓడించడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోందన్నాడు. సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుండటం తమకు కలిసొస్తుందని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.
జియో సినిమాతో బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ… ‘బెంగళూరు, ఢిల్లీ జట్లు విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నాయి. టోర్నీలో మేం ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాం. గత నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించాం. ఢిల్లీ కూడా గత నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలిచి ఊపు మీదుంది. అయితే రిషబ్ పంత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇది ఢిల్లీకి పెద్ద ఎదురు దెబ్బ. అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మమ్మల్ని ఓడించడం కష్టమే. బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగా రాణిస్తోంది. సొంతమైదానంలో ఆడనుండటం కూడా మాకు కలిసొస్తుంది’ అని అన్నాడు.
Also Read: CSK vs RR: రాజస్థాన్‌దే బ్యాటింగ్.. గెలిస్తేనే చెన్నై నిలిచేది!
బెంగళూరు, ఢిల్లీ జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. అయితే బెంగళూరు కంటే ఢిల్లీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 6 విజయాలతో పట్టికలో ఢిల్లీ ఐదవ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. మరోవైపు 12 మ్యాచ్‌లలో 5 విజయాలతో బెంగళూరు 7వ స్థానంలో ఉంది. బెంగళూరు మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.