Ravi Shastri Says Tilak Verma Will Get Placement In Indian Team In Six Months Of Span: ముంబై ఇండియన్స్ యువ సంచలనం, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ఈ ఐపీఎల్-2023 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే! ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు ఇతర స్టార్ ప్లేయర్స్ చతికిలపడితే.. ఇతనొక్కడే ఒంటరి పోరాటంతో నెగ్గుకొచ్చాడు. 46 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ ఓడినా.. తిలక్ వర్మ పేరు మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తిలక్ (18 బంతుల్లో 22) తడబడ్డాడు కానీ.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి.. మ్యచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై తరఫున 147 పరుగులతో అతడే టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు.
Chennai Super Kings: చెన్నై మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్
ఈ నేపథ్యంలోనే.. తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు తప్పకుండా భవిష్యత్తులో మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడని ప్రస్తుత సీనియర్ ప్లేయర్లతో పాటు మాజీలు సైతం కొనియాడుతున్నారు. ఇప్పుడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ హైదారాబాదీని పొగడ్తలతో ముంచెత్తాడు. అతి త్వరలోనే అతడు భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని జోస్యం చెప్పారు. ‘‘తిలక్ వర్మ రూపంలో టీమిండియాకు మరో యువ సంచలనం దొరికాడు. నేనైతే అతడ్ని ఇప్పటికే టీమిండియా ఆటగాడిగా భావిస్తున్నా. మరో ఐదారు నెలల్లో టీమిండియా తరఫున తిలక్ ఆడకపోతే.. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతనికి ఉంది. 20 ఏళ్ల వయస్సులోనే అతడు ఆడుతున్న ఆటతీరు గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముంబైకే కాదు, భారత జట్టుకు అతడు అద్భుతాలు సృష్టిస్తాడు’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నారు.
Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
కాగా.. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడింది. తొలి రెండు మ్యాచెస్‌లో పరాజయం చవిచూసిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం విజయఢంకా మోగించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించింది. దీంతో.. పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయితే.. ముంబై రన్ రేట్ తక్కువగానే ఉంది. తొలి నాలుగు స్థానాల్లో చోటు కైవసం చేసుకోవాలంటే.. వరుస విజయాలు సాధిస్తూనే, రన్ రేట్‌ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ముంబై తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 16వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.