Sam Curran apologize to fans after Punjab Kings eliminated from IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించడం చాలా బాధగా ఉందని ఆ జట్టు కెప్టెన్ సామ్ కరన్ తెలిపాడు. అభిమానులు తమని క్షమించాలని, మిగతా మ్యాచ్‌లలో తాము పోరాడుతామన్నాడు. ఈ సీజన్ అంతటా చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లలో ఓటమి చెందాల్సి వచ్చిందన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టును నడిపించడం బాగుందని కరన్ పేర్కొన్నాడు. గురువారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. దాంతో ఐపీఎల్ 2024లో పంజాబ్ కథ ముగిసింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ మాట్లాడుతూ… ‘ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం చాలా బాధగా ఉంది. ఈ సీజన్‌లో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు విజయాలు సాధించలేకపోయాం. టోర్నమెంట్‌లో మేము అత్యుత్తమ జట్టును కలిగి ఉన్నాం. జట్టు కోసం తలెత్తుకుంటూ, నేర్చుకుంటూ మేం మరింత మెరుగ్గవ్వాలి. గొప్ప ప్లేయర్లు ఉన్న ఈ జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో మేం కొన్ని ఘనతలు సాధించాం, రికార్డు ఛేజింగ్ చేశాం. కానీ ప్లే ఆఫ్స్ చేరుకోలేకపోవడం బాధగా ఉంది. మా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. మేము పోరాడుతూనే ఉంటాము. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, కష్టపడి పనిచేయాలి’ అని అన్నాడు.
Also Read: Virat Kohli Six: విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్సర్.. వీడియో వైరల్!
ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై చేతిలో ఓడిపోవడం పంజాబ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ తర్వాత అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టు పంజాబ్.