Glenn Maxwell Unwanted Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా ఆర్‌సీబీ మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్‌తో కలిసి మ్యాక్సీ సమంగా నిలిచాడు. ఐపీఎల్‌లో డీకే, మాక్స్‌వెల్ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ డకౌట్ అవ్వడంతో ఈ చెత్త రికార్డు అతడి ఖాతాలో చేరింది.
రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ జాబితాలో కార్తీక్, మాక్స్‌వెల్ తర్వాత ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (17) ఉన్నాడు. పీయూష్ చావ్లా (16), సునీల్ నరైన్ (16).. రషీద్ ఖాన్ (15), మన్దీప్ సింగ్ (15) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్స్‌వెల్ (32) నాలుగో స్ధానంలో నిలిచాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 17 ఏళ్ల ఐపీఎల్‌లో మొదటి క్రికెటర్!
ఐపీఎల్ 2024లో గ్లెన్ మాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. 0, 16, 4, 0, 1, 0, 28, 3, 0 ఈ సీజన్‌లో మ్యాక్సీ చేసిన పరుగులు. ఆస్ట్రేలియాకు ఎన్నోసార్లు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించిన మాక్స్‌వెల్.. ఇంత దారుణంగా ఆడటంతో బెంగళూరు ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే సీజన్‌లో మ్యాక్సీ బెంగళూరులో ఉండడం కష్టమే అని అంటున్నారు. ఐపీఎల్ 2024లో బెంగళూరు కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.