Hardik Pandya Praises MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉందని, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 207 పరుగుల టార్గెట్ ఛేదించగలిగిందే అని, కానీ చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చెన్నై, ముంబైకి మధ్య వ్యత్యాసం మహీశ పతిరన ప్రదర్శనే అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. పతిరన నాలుగు వికెట్లు తీసి ముంబైని దెబ్బ కొట్టాడు.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘ఈ లక్ష్యం ఛేదించగలిగిందే. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. చెన్నై, ముంబైకి మహీశ పతిరన ప్రదర్శనే ప్రధాన వ్యత్యాసం. ప్రణాళికలకు తగ్గట్టుగా చెన్నై ఆడింది. చెన్నై స్టంప్ (ఎంఎస్ ధోనీ)ల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మాస్టర్ మైండ్. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో అతడికి బాగా తెలుసు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ కఠినంగా మారింది. లక్ష్య ఛేదనలో మేం దూకుడుగానే వెళ్లాం. పతిరన బౌలింగ్‌కు వచ్చి రెండు వికెట్లు తీసినప్పుడు కాస్త వెనుకడుగు వేశాం’ అని అన్నాడు.
Also Read: Friendship: తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని.. వైద్యుడిపై కాల్పులు
‘తొలుత చెన్నై బ్యాటింగ్ సమయంలోనూ బౌలింగ్‌లో మార్పులు చేయడానికి ఓ కారణం ఉంది. శివమ్ దూబె స్పిన్ కంటే సీమ్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడతాడు. అందుకే అతడు బ్యాటింగ్ చేసే సమయంలో పేసర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమి నుంచి బయటపడి మిగతా మ్యాచ్‌ల కోసం సన్నద్ధమవుతాం. తర్వాత నాలుగు మ్యాచ్‌లు మాకు చాలా కీలకం. ప్రత్యర్థుల సొంత మైదానాల్లో ఆడాల్సి ఉంది. ఒత్తిడి లేకుండా మంచి క్రికెట్ ఆడాలి’ అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.