Shreyas Iyer on KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడారని, అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. కీలక పోరులో మిచెల్ స్టార్క్ గొప్ప ప్రదర్శన చేశాడని, యువ ఆటగాళ్లు తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చని శ్రేయస్ అన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుచేసిన కోల్‌కతా టైటిల్‌ను ఒడిసి పట్టింది.
మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘జట్టుగా మేం సాధించాలని కోరుకున్నది ఇదే. కీలక సమయంలో ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. ఈ విజయం కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నా. ఈ సీజన్ మొత్తం మేం అద్భుత ఆట తీరును ప్రదర్శించాం. తొలి మ్యాచ్‌ను అంతటి నిబద్ధతతో ఆడామో.. ఫైనల్‌లోనూ అదే స్ఫూర్తితో పోరాడాం. పరిస్థితి ఎలా ఉన్నా ఒకరికొకరు అండగా నిలిచారు. ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాం. మాటలు రావడం లేదు’ అని అన్నాడు.
Also Read: Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌పార్టీ.. నేడు 86 మందిని విచారించనున్న పోలీసులు!
‘సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడారు. సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు. పోటీ ఉన్నప్పుడే మనలోని టాలెంట్ బయటికొస్తుంది. ఈ మ్యాచ్‌లో మేం తొలుత బౌలింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మ్యాచ్ చివరి వరకూ మా చేతుల్లోనే ఉంది. భారీ ఒత్తిడి కలిగిన ఇలాంటి మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ వంటి స్టార్ ప్లేయర్లు నాణ్యమైన ప్రదర్శన చేస్తే.. జట్టుకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వెంకటేశ్ అయ్యర్.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించారు. కుర్రాళ్లందరూ సరైన సమయంలో జట్టును ఆదుకున్నారు. ఇది మాకు అద్భుత సీజన్’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.