ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు, ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2016లో తన అద్భుతమైన కెప్టెన్సీతో హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్ ట్రోఫీని అందించిన వార్నర్, ఇక్కడి అభిమానుల గుండెల్లో ‘తెలుగు తమ్ముడు’గా స్థానం సంపాదించుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా ఫ్రాంచైజీ యాజమాన్యానికి, వార్నర్‌కు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా.. సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి బ్లాక్ చేసిందనే వార్త ఐపీఎల్ వర్గాల్లో , క్రికెట్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాడిపై ఫ్రాంచైజీ ప్రదర్శించిన ఈ తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అభిమానుల ఆగ్రహం..
ప్రస్తుత సన్‌రైజర్స్ ఓపెనర్, తన తోటి ఆస్ట్రేలియా ఆటగాడైన ట్రావిస్ హెడ్ ప్రదర్శనను అభినందిస్తూ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక పేజీ ట్యాగ్ అవ్వకపోవడంతో, సదరు ఫ్రాంచైజీ తనను బ్లాక్ చేసిందనే విషయాన్ని వార్నర్ స్క్రీన్ షాట్ల ద్వారా సాక్ష్యాలతో సహా బయటపెట్టారు.
నిజానికి ఈ వివాదానికి బీజం 2021 ఐపీఎల్ సీజన్ లోనే పడింది. ఆ సమయంలో ఫామ్ కోల్పోయాడనే నెపంతో వార్నర్‌ను మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడమే కాకుండా, కనీసం డగౌట్‌లో కూడా కూర్చోనివ్వకుండా యాజమాన్యం అవమానించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో అతడిని జట్టు పూర్తిగా వదిలేసుకుంది. బహుశా ఆ సమయంలోనే ఈ బ్లాకింగ్ వ్యవహారం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.
అభిమానుల స్పందన..
ఒంటిచేత్తో జట్టును నడిపించి కప్ అందించిన వీరుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. క్రీడా స్ఫూర్తిని మరచి, వ్యక్తిగత కక్షలతో ఫ్రాంచైజీ ప్రవర్తిస్తోందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. యాజమాన్యం దూరం పెట్టినా, హైదరాబాద్ అభిమానుల గుండెల్లో వార్నర్ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక ఛాంపియన్ ఆటగాడి పట్ల సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వ్యవహరించిన ఈ తీరు క్రికెట్ ప్రియులను తీవ్రంగా గాయపరిచింది.
