Site icon NTV Telugu

IPL 2026: “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే కంటే ఆ కుర్రాడు చాలా గ్రేట్”.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..

R Ashwin Praises

R Ashwin Praises

IPL 2026: గత వారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాదిలో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ 24 ఏళ్ల ఆటగాడు, అప్పుడే 475 పరుగులు సాధించి తన రాకను చాటుకున్నాడు. ఆదివారం లక్నోపై ప్రియాన్ష్ ఆడిన ఇన్నింగ్స్ అనంతరం.. టీమిండియా మాజీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రియాంశ్ ఆర్యను ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అదరగొడుతున్న కుర్రాళ్లు ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ కంటే ప్రియాంశ్ ఒక అడుగు ముందే ఉన్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. “నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదు కానీ, ప్రియాంశ్ ఆర్య ఆడే తీరు అద్భుతం. అతని వద్ద షాట్ల రేంజ్ ఎక్కువగా ఉంది. పెద్ద స్కోర్లు సాధించడంలో అతను మిగిలిన యువ ఆటగాళ్ల కంటే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు” అని అశ్విన్ ప్రశంసించాడు.

READ MORE: Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..

ఈ సీజన్‌లో ప్రియాంశ్ ఆర్య గణాంకాలను పరిశీలిస్తే… 5 మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేశాడు. సగటు (Average) 42.2గా ఉంది. 248 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు. 11 బంతుల్లో 39, 20 బంతుల్లో 57, 37 బంతుల్లో 93 పరుగులు వంటి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, ఇతర యువ ఆటగాళ్ల విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున అద్భుతంగా ఆడుతున్న ఆయుష్ మ్హత్రే దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆయుష్ 6 ఇన్నింగ్స్‌ల్లో 33.50 సగటుతో 201 పరుగులు చేశాడు. ఇకపోతే, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న మరో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ కూడా పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. వైభవ్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 246 పరుగులు సాధించి టోర్నమెంట్‌లో టాప్ పర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక.. నిలకడ, భారీ స్కోర్లు చేసే సత్తా, అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఉండటం వల్లే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రియాంశ్ ఆర్య భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

Exit mobile version