PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..

Punjab Kings

Punjab Kings

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఒక ఆసక్తికరమైన వైరుధ్యం. మైదానంలో ఆ జట్టు టైటిల్ కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తుంటే, మైదానం బయట మాత్రం కాసుల వర్షం కురిపిస్తూ వ్యాపార పరంగా అద్భుత విజయాలను అందుకుంటోంది. 2008 నుంచి ఆడుతున్నా ఇప్పటికీ ట్రోఫీ లేకపోయినా, ఈ ఫ్రాంచైజీ ఆర్థికంగా ఎలా బలపడుతుందో ఇక్కడ తెలుసుకోండి.

2025 నాటికి పంజాబ్ కింగ్స్ విలువ సుమారు రూ. 1,195 కోట్లకు చేరుకుంది. కేవలం ఒకే ఏడాదిలో 40 శాతం వృద్ధి సాధించడం విశేషం. టైటిల్స్ గెలవకపోయినా ఈ స్థాయిలో లాభాలు రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్ రెవెన్యూ షేరింగ్ మోడల్. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఐదేళ్లకు రూ. 48,390 కోట్లు. ఇందులో 50 శాతం వాటా బీసీసీఐ తీసుకుంటే, మిగిలిన 50 శాతం మొత్తం 10 ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. దీనివల్ల పంజాబ్ కింగ్స్‌కు ప్రతి ఏటా దాదాపు రూ. 484 కోట్లు గ్యారెంటీ ఆదాయం వస్తుంది.

నిర్వహణ లాభాల విషయంలో.. 2026లో ప్లేయర్ల శాలరీ క్యాప్ రూ. 130–140 కోట్లుగా ఉండనుంది. అంటే కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఒక్కటే ఆటగాళ్ల ఖర్చులను భర్తీ చేసి.. అందులో ఇంకా భారీ లాభాలను మిగిలిస్తుంది. సహ యజమాని ప్రీతి జింటా సెలబ్రిటీ హోదా జట్టుకు విపరీతమైన మీడియా కవరేజీని, స్పాన్సర్‌షిప్‌లను తెచ్చిపెడుతోంది. ఫలితంగా 2024లో 49 శాతం, 2025లో 39.6 శాతం బ్రాండ్ విలువ పెరిగింది. మైదానంలో ఫలితాలతో సంబంధం లేకుండా, ఐపీఎల్ ఆర్థిక వ్యవస్థ పంజాబ్ కింగ్స్‌ను ఒక శక్తివంతమైన వ్యాపార సంస్థగా మార్చింది. క్రీడాపరంగా వైఫల్యాలు ఎదురైనా, ఆర్థికంగా మాత్రం పంజాబ్ కింగ్స్ ‘అసలైన రాజు’ అని నిరూపించుకుంటోంది.