IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..

Litton Das

Litton Das

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ లిటన్ దాస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్ జట్టులో భాగమైన తనకు, ఆ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఆ జట్టుకు తన అవసరమే లేదనే భావన తనకు కలిగిందని లిటన్ దాస్ పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్ క్రికెట్‌కు చెందిన అధికారిక ‘చార్ చొక్కా’ పాడ్‌కాస్ట్‌లో లిటన్ దాస్ మాట్లాడుతూ.. కేకేఆర్ జట్టులో ఆటగాళ్లతో కమ్యూనికేషన్ చాలా లోపించిందని విమర్శించాడు. ముఖ్యంగా తను ఆడే మ్యాచ్‌కు ముందు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. “సాధారణంగా ఏ ఆటగాడికైనా తను తర్వాతి మ్యాచ్ ఆడబోతున్నాడు అనే విషయం ముందుగానే తెలుస్తుంది. కానీ నా విషయంలో అలా జరగలేదు. రెండు మ్యాచ్‌ల్లో నన్ను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆ తర్వాత నా ప్రణాళికల గురించి యాజమాన్యం నాతో ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ, ఒకరోజు అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకు ‘నువ్వు రేపటి మ్యాచ్ ఆడుతున్నావు’ అని నాకో మెసేజ్ వచ్చింది.”

ఆ సమయంలో తన వద్ద ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ఆడేందుకు ప్రయత్నించానని, అయితే దురదృష్టవశాత్తూ ఆ రోజు తనది కాకుండా పోయిందని లిటన్ దాస్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిటన్ దాస్.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా అతను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. ఆ ప్రదర్శన అనంతరం ఐపీఎల్ 2024 వేలానికి ముందే కేకేఆర్ అతడిని విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కేకేఆర్ జట్టు రెండుసార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కేకేఆర్ ఫ్రాంచైజీ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని టోర్నీ ప్రారంభానికి ముందే జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది.