Site icon NTV Telugu

Sachin Tendulkar: నా కెరీర్‌లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar

Sachin Tendulkar

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒక అద్భుతమైన క్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టిన ఈ క్యాచ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి అని సచిన్ కొనియాడారు.

అసలేం జరిగింది?
ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మార్కో జాన్సెన్ వేసిన బంతిని హార్దిక్ పాండ్యా బౌండరీ వైపు బలంగా బాదాడు. అది సిక్సర్ వెళ్తుందని అందరూ భావించారు. కానీ లాంగ్-ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ గాలిలోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. తాను బౌండరీ లైన్ దాటుతున్నానని గ్రహించి, కింద పడబోయేలోపు చాకచక్యంగా బంతిని పక్కనే ఉన్న గ్జేవియర్ బార్ట్లెట్‌కు విసిరాడు. బార్ట్లెట్ దాన్ని సులువుగా అందుకోవడంతో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు.

సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..?
ఈ అద్భుతమైన ఫీల్డింగ్‌ను చూసి సచిన్ ఫిదా అయిపోయారు. “ఈ క్యాచ్ ఇంత స్పెషల్ కావడానికి కారణం కేవలం శ్రేయస్ శారీరక వేగం మాత్రమే కాదు, అతని సమయస్ఫూర్తి కూడా. బంతి వేగాన్ని అంచనా వేయడం, బౌండరీ లైన్‌కు ఎంత దూరంలో ఉన్నామో చూసుకోవడం, గాలిలో ఉండగానే పక్కనే ఉన్న ఫీల్డర్‌కు బంతిని విసరడం.. ఇవన్నీ సెకను కాలంలో జరిగిపోయాయి. దీనికి అద్భుతమైన ఫిట్‌నెస్, ఏకాగ్రత అవసరం. శ్రేయస్ ఇవన్నీ పక్కాగా చేశాడు” అని సచిన్ తన సోషల్ మీడియా వేదికగా మెచ్చుకున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ క్వింటన్ డికాక్ సెంచరీ (112 నాటౌట్) సాయంతో 195 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశాడు. అనంతరం పంజాబ్ ఈ లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (66) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. శ్రేయస్ అయ్యర్ పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

 

Exit mobile version