RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..

Vaibhav Sooryavanshi Weakness

Vaibhav Sooryavanshi Weakness

ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయనుంది. టాస్ సమయంలో స్వల్ప గందరగోళం నెలకొంది. రియాన్ పరాగ్ చేసిన ‘హెడ్స్’ కాల్‌ను మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ మైదానంలోని సందడి వల్ల సరిగ్గా వినలేకపోయారు. దీంతో టాస్‌ను మరోసారి నిర్వహించాల్సి వచ్చింది. రెండోసారి కూడా టాస్ గెలిచిన పరాగ్ ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో ఆరు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డుపై గురిపెట్టాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (2012లో 59 సిక్సర్లు) 14 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అతను 65 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో సెంచరీ సాధించిన రికార్డుతో పాటు, ఒకే సీజన్‌లో 200 పైగా స్ట్రైక్ రేట్‌తో 650 కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. నేటి మ్యాచ్‌లో ఈ రికార్డులను మరింత బలోపేతం చేసుకుంటూ జట్టును ఫైనల్‌కు చేర్చడమే లక్ష్యంగా వైభవ్ బరిలోకి దిగుతున్నాడు. అంతే కాకుండా.. 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును కూడా ఈ మ్యాచ్ లో వైభవ్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

×
×
Ad

ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా గుజరాత్‌ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కాగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతుండగా, స్పిన్ విభాగాన్ని బలోపేతం చేస్తూ సాయి కిషోర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.