Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..

Orange Cap Race

Orange Cap Race

ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విశ్వరూపానికి వేదికగా నిలిచింది. లీగ్ దశలో రికార్డు స్థాయిలో 9.85 రన్ రేట్ నమోదు కావడం, 220కి పైగా పరుగుల లక్ష్యాలను జట్లు ఏకంగా తొమ్మిది సార్లు ఛేదించడం ఈ సీజన్ తీవ్రతను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి దక్కే ‘ఆరెంజ్ క్యాప్’ రేసు ప్లేఆఫ్స్ వేళ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో 158 స్ట్రైక్ రేట్‌తో రాణిస్తున్న సుదర్శన్, తన జట్టు క్వాలిఫైయర్-2 గెలిస్తే మరో రెండు ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉండటంతో రేసులో ముందున్నాడు.

అతని వెంటే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 618 పరుగులతో గట్టి పోటీ ఇస్తున్నాడు. 160 స్ట్రైక్ రేట్, ఆరు అర్ధసెంచరీలతో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 164.38 కెరీర్ బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో 600 పరుగులు పూర్తి చేసి నాల్గవ స్థానంలో ఉన్నాడు. అయితే, ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరడంతో కోహ్లీకి కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే మిగిలి ఉండటం అతనికి కొంత ప్రతికూలాంశం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మిడిలార్డర్ విధ్వంసకుడు హెన్రిచ్ క్లాసెన్ నంబర్ 4 లేదా ఆపై స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 606 పరుగులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతనితో పాటు ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (569 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ చేరితే వీరికి మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుంది. దీనివల్ల కాటేరమ్మ కొడుకులకే ఆరెంజ్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  మరోవైపు రాజస్థాన్ రాయల్స్ (RR) 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 583 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధికంగా 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ 230+ స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. గణాంకాల పరంగా చూస్తే ప్రస్తుతానికైతే సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలిమినేటర్ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ లేదా రాజస్థాన్ రాయల్స్ గనుక ఫైనల్ వరకు దూసుకెళ్తే క్లాసెన్, సూర్యవంశీలు అనూహ్యంగా అగ్రస్థానానికి దూసుకొచ్చే అవకాశం ఉంది.