NTV Telugu Site icon

SRH vs RR Qualifier 2: నేడు క్వాలిఫయర్‌-2.. ఫైనల్‌కు వెళ్లేదెవరో!

Srh Vs Rr Qualifier 2

Srh Vs Rr Qualifier 2

SRH vs RR Qualifier 2 Prediction: ఐపీఎల్‌ 2024లో నేడు క్వాలిఫయర్‌-2 జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్తాన్‌ రాయల్స్ క్వాలిఫయర్‌–2 సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగే ఫైనల్‌లో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్.. రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మలపైనే భారమంతా ఉంది. ఈ ఇద్దరు గత మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయితే.. పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. దాంతో ఈ కీలక మ్యాచ్‌లో చెలరేగాలని టీం ఆశిస్తోంది. హేన్రిచ్ క్లాసెన్‌ ఫామ్‌ కొనసాగించడం కలిసొచ్చే అంశం. రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌ సహకరించాల్సి ఉంది. బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు ఐడెన్ మార్క్‌రమ్‌ లేదా గ్లెన్‌ ఫిలిప్స్‌లలో ఒకరిని ఆడించవచ్చు. విజయకాంత్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేను తీసుకొని.. ఇంపాక్ట్‌ ద్వారా మరో బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది.

అయితే బంతి ఆగి వచ్చే చెపాక్‌లో ఆడడం స్ట్రోక్‌ప్లే బ్యాటర్లకు సవాలే. ఇక్కడ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. చెపాక్‌లో ఎంతో క్రికెట్‌ ఆడిన అశ్విన్‌, చహల్‌లు హెడ్, అభిషేక్, క్లాసెన్‌లను త్వరగా వెనక్కి పంపి మ్యాచ్‌పై రాజస్థాన్‌ పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి. చెపాక్‌ పిచ్‌పై షహబాజ్‌తో పాటు మరో స్పిన్నర్‌ జట్టుకు అవసరం. పేస్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్‌లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్‌ కీలకం అవుతారు.

మరోవైపు రాజస్థాన్‌ వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో విజయంతో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం అయింది. రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది. జైస్వాల్‌, శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మయర్‌, పావెల్, కోలర్, జురేల్ వంటి వారితో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బాగుంది. వీరిని నిలువరించడం హైదరాబాద్‌ బౌలర్లకు సవాలే. అగ్రశ్రేణి స్పిన్నర్లు అశ్విన్, చహల్‌.. పేసర్ బౌల్ట్ జట్టు భారం మోస్తారు. ఈ ముగ్గురు చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు.

తుది జట్లు (అంచనా):
హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్‌ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్‌రమ్‌.
రాజస్తాన్‌: సామ్సన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, టామ్‌ కోలర్, పరాగ్, జురేల్, హెట్‌మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్‌ ఖాన్, సందీప్‌ శర్మ, చహల్‌.