NTV Telugu Site icon

RCB vs CSK: నేడే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌.. ఆఖరి ప్లేఆఫ్స్‌ బెర్తు ఎవరిదో! ఛాన్సెస్ ఇలా

Rcb Vs Csk

Rcb Vs Csk

IPL 2024 RCB vs CSK Playoff Qualification Scenario: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో నేడు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. దాంతో ఈ మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ 2024లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఒక్క పాయింట్ లభించినా సరిపోతుంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించినా లేదా మ్యాచ్‌ రద్దయినా.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. రన్‌రేట్‌ (0.528) మెరుగ్గా ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. 90 శాతం అవకాశాలు చెన్నైకే ఉన్నాయని చెప్పొచ్చు.

Also Read: SRH Fans: హైదరాబాద్ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. టికెట్ల డబ్బు వాపసు!

8 మ్యాచ్‌ల్లో ఒకే గెలుపుతో ప్లేఆఫ్స్‌ పోటీలో లేదనుకున్న బెంగళూరు.. అద్భుతంగా పుంజుకుని వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు రన్‌ రేట్‌లో (0.387) చెన్నై కంటే కాస్త వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైపై బెంగళూరు గెలిస్తే సరిపోదు. భారీ విజయం సాధిస్తేనే బెంగళూరుకు అవకాశం ఉంటుంది. బెంగళూరు మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. అయితే మ్యాచ్‌ పూర్తిగా సాగుతుందా? అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Show comments