NTV Telugu Site icon

IPL 2024 Playoffs: హైదరాబాద్‌కు గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే సెకండ్ ప్లేస్ పక్కా!

Srh

Srh

Orange Army Top 2 Scenario in IPL 2024 Playoffs: ఐపీఎల్ 17వ సీజన్‌ తుది అంకానికి చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌ అర్హత సాధించగా.. మిగిలిన ఓ ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ చివరి బెర్త్ కోసం రేసులో ఉన్నాయి. ఇప్పటికే 14 పాయింట్స్ ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చెన్నై తర్వాత బెంగళూరు అవకాశాలు ఉన్నాయి.

శనివారం జరగనున్న మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై గెలిస్తే.. 16 పాయింట్లతో యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అప్పుడు బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఇంటిదారి పడుతాయి. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తేనే బెంగళూరు ముందంజ వేస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ప్రస్తుతం మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉండడం చెన్నైకి బాగా కలిసొచ్చే అంశం. 99 శాతం అవకాశాలు చెన్నైకే ఉన్నాయి.

Also Read: IPL 2024 Playoffs: చెన్నైకి ‘సూపర్’ ఛాన్స్‌.. అదే జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే ఆరెంజ్‌ ఆర్మీకి రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్‌ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తప్పక గెలవాల్సి ఉంటుంది. మరోవైపు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లకే పరిమితం అవుతుంది. హైదరాబాద్‌ 17 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళుతుంది. మొదటి రెండు స్థానాల్లో ఉంటే.. క్వాలిఫైయర్ 1లో ఓడినా.. క్వాలిఫైయర్ 2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.