IPL 2024 CSK vs SRH Black Tickets: ఓ వైపు బ్లాక్ టిక్కెట్ల దందా, మరోవైపు కోచ్ మద్యం సేవించడం, ఇంకోవైపు పవర్ కట్.. ఇలా ఎన్నో సమస్యలు ఉప్పల్ స్టేడియంను వెంటాడుతున్నాయి. స్టేడియం నిర్మించి 19 ఏళ్లు దాటినా ఊహించినంత అభివృద్ధి జరగలేదు. తాను అధ్యక్షుడు అయితే హెచ్‌సీఏ రూపురేఖలు పూర్తిగా మారుస్తన్నన్న జగన్మోహన్ రావు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలోని ఒక్కో సమస్య బయటపడుతోంది. అవేంటో ఓసారి చూద్దాం.
బ్లాక్ టిక్కెట్ల దందా:
సొంత మైదానంలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసి ఆస్వాదించాలనే ఫాన్స్ కోరికను కొంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఐపీఎల్ 2024 సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్‌లో అమ్ముతుండడం విశేషం. 2-3 రెట్లు ఎక్కువ ధరకు టిక్కెట్లు అముతున్నారు. ఇన్ని టిక్కెట్లు వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయో? అర్ధం కావడం లేదు.
ఒక్కో టిక్కెట్ 10 వేలు:
ఐపీఎల్ 2024 టిక్కెట్లను పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో అమ్మకానికి పెడుతున్నారు. అమ్మకానికి పెట్టిన నిమిషాల వ్యవధిలో అన్ని ఖతం అవుతున్నాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ మొత్తం 35 వేలు కాగా.. 10 వేల వరకు కాంప్లిమెంటరీ పాసులు ఉంటాయి. మిగతా 25 వేలలో హెచ్‌సీఏ ఎన్ని టికెట్స్ అమ్మకానికి పెడుతుందన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ప్రతి అభిమాని కూడా టికెట్స్ దొరకడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హెచ్‌సీఏనే టికెట్స్ బ్లాక్ చేసి.. అధిక ధరకు అమ్ముకుంటుందని నెటిజన్స్ అంటున్నారు. ఒక్కో టికెట్ 5 నుంచి 10 వేలకు కూడా అముతున్నారట.
కరెంట్ కట్:
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మరికొన్ని గంటల్లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించకుండా.. రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ తెలిపింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా హెచ్‌సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ లేకపోవడంతో జనరేటర్ల సహాయంతో హైదరాబాద్, చెన్నై క్రికెటర్లు ఈరోజు ప్రాక్టీస్ చేశారు. దాంతో శుక్రవారం స్టేడియంలో మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ జరుగుతుందా? లేదా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించడం:
మహిళా క్రికెటర్ల హెడ్ కోచ్ జై సింహా వ్యవహారం ఇటీవల పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో జై సింహా.. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడు. దాంతో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహార శైలిపై హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా హెచ్‌సీఏ చాలా రోజులు పట్టించుకోలేదు. విషయం బయటికి రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితులలో జై సింహాపై చర్యలు తీసుకున్నారు.