Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం సరిగా లేదని తెలుస్తోంది. ఇందుకు కారణం కొత్త కెప్టెన్ శైలే కారణమని సీనియర్లు కోచ్ బృందానికి వెల్లడించారు.
ఇటీవల ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబై ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సమావేశం అయ్యారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు సమావేశంలో పాల్గొన్నారు. జట్టు సరిగ్గా ఆడలేకపోవడంపై తమ తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. అనంతరం సీనియర్లు, జట్టు మేనేజ్‌మెంట్ బృందంతో ఒక్కొక్కరుగా మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశంపై ముంబై జట్టు అధికారి ఒకరు మాట్లాడారు. ‘రోహిత్ శర్మ నాయకత్వంలో పదేళ్లు ఆడిన ముంబై జట్టు.. కొత్త మార్పునకు ఇంకా అలవాటు పడలేదు. సాధారణంగా ఏ జట్టులో అయినా నాయకత్వ మార్పు చోటు చేసుకుంటే.. ఇలాంటివి సహజమే’ అని అన్నాడు.
Also Read: Sunrisers Hyderabad: ఏంటా బ్యాటింగ్.. 300 స్కోరు కొట్టేవారు: సచిన్
ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమికి టాప్ స్కోరర్ అయిన తిలక్ వర్మను హార్దిక్ పాండ్యా తప్పుపట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ‘అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్ అయిన తిలక్ వర్మకు బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో తిలక్ దూకుడుగా ఆడి ఉండాల్సింది. ఆటపై ఉండే ఈ చిన్న అవగాహన లోపించడంతో మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకున్నాం’ అని పేర్కొన్నాడు. ఓటమి మొత్తాన్ని తనపై వేయడంతో తిలక్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వద్ద ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఢిల్లీ మ్యాచ్‌లో తిలక్ 32 బంతుల్లో 63 రన్స్ చేశాడు.