IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!

  • క్రికెట్ గ్రౌండ్‌లో వాళ్లిద్దరే ప్రధానం
  • ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వకుండా వర్క్ చేసేది వాళ్లే
  • వాళ్ల శాలరీ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Umpire

Umpire

క్రికెట్‌ అంటే ఇండియాలో ఇష్టంలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా ప్లేయర్లంటే పడిచచ్చే మనదేశంలో చాలామందికి స్టార్ ఆటగాళ్లే దేవుళ్లు కూడా. సచిన్‌ లాంటి ఆటగాళ్ల కోసం తిండీతిప్పలు మానేసి ఉపవాసాలు చేసిన దేశం మనది. మ్యాచ్ చూస్తున్నప్పుడు మన కళ్లంతా బ్యాట్స్ మెన్ మీదే ఉంటాయి. సిక్స్ కొట్టాడా…? బౌండరీ వెళ్లిందా…? వికెట్ పడిందా…? మైండ్‌ ఎప్పుడూ వీటి గురించే ఆలోచిస్తుంటుంది. అయితే అదే గ్రౌండ్‌ మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వకుండా తమ వర్క్ చేస్తుంటారు. వాళ్లే అంపైర్లు.

ఒత్తిడితో నిండిన జాబ్..
ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా.. ఈ సీజన్‌లోనూ పలు అంపైరింగ్‌ ఎర్రర్స్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. ప్లేయర్ తప్పు చేస్తే ఫ్యాన్స్ కొద్దిసేపు తిట్టి మర్చిపోతాం కానీ అంపైర్ తప్పు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో రాత్రికిరాత్రే ట్రోల్స్ వర్షం కురుస్తుంది. అందుకే క్రికెట్‌లో అంపైరింగ్ అనేది కనిపించని ప్రెషర్ జాబ్ అంటారు. అయితే ఈ ఒత్తిడికి తగ్గట్టే ఇప్పుడు అంపైర్లకు వచ్చే డబ్బులు కూడా షాక్‌కి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత అంపైర్ల లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అంపైర్ అంటే తెల్ల టోపీ పెట్టుకుని నిలబడి ఉండే వ్యక్తి అనుకునేవాళ్లు. వాళ్ళపై సినిమాల్లో జోకులు కూడా వేస్తుంటారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అంపైర్లను కూడా క్రికెట్‌ ఫ్యాన్స్ హై ప్రొఫైల్ ప్రొఫెషనల్స్‌గానే చూస్తున్నారు.

లక్షల్లో సంపాదన..
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎలైట్ ప్యానెల్ అంపైర్లకు భారీగా చెల్లిస్తోంది. ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తే దాదాపు 4లక్షల రూపాయలు వస్తాయి. వన్డే మ్యాచ్‌కు రెండున్నర లక్షలు. టీ-20 మ్యాచ్‌కు రూ.1.25 లక్షలు ఇస్తారు. ఇలా ఏడాదికి కొంతమంది అంపైర్లు రూ.75 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్స్, ట్రావెల్ అలవెన్సులు వేరున్నాయి.

మొత్తం ఎన్ని క్యాటగిరిలంటే?
ఇండియాలో బీసీసీఐ కూడా అంపైర్లను నాలుగు గ్రూపులుగా విభజించింది. ఏ-ప్లస్, ఏ, బీ, సీ అని క్యాటగిరీలు ఉంటాయి. ఎవరు బాగా అంపైరింగ్ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఉంటుంది. మిస్టేక్స్‌ ఎక్కువగా చేస్తే కింద క్యాటగిరికి కూడా పంపిస్తారు. ప్రస్తుతం ఏ-ప్లస్, ఏ-గ్రూప్ అంపైర్లకు రోజుకు 40వేల రూపాయలు ఇస్తున్నారు. బీ, సీ గ్రూప్ అంపైర్లకు రోజుకు 30 వేల రూపాయలు వస్తున్నాయి. దేశీయ టోర్నమెంట్లు మొత్తం కలిపి ఒక సీజన్‌లో 10 నుంచి 20 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ అసలు భారీ డబ్బు మాత్రం ఐపీఎల్‌లోనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్ కు దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలామంది ఊహించని విషయం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌కే ఎక్కువ డబ్బు వస్తోంది. ఫోర్త్ అంపైర్‌కు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తారు. సాధారణంగా ఒక అంపైర్ సీజన్ మొత్తం 15 మ్యాచ్‌ల వరకు అంపైరింగ్ చేస్తాడు. అంటే కేవలం రెండు నెలల్లోనే దాదాపు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

అందుకే ఇప్పుడు క్రికెట్‌లో అంపైర్ పని అంటే కేవలం వేళ్లెత్తి అవుట్ అని చూపించడం కాదు. అది ఫుల్ టైం ప్రెషర్ జాబ్. ఒక్క బంతి కోసం కోట్ల మంది చూస్తుంటారు. డీఆర్‌ఎస్ ఉంటుంది. అల్ట్రా ఎడ్జ్ ఉంటుంది. స్లో మోషన్ రీప్లేలు ఉంటాయి. అయినా చివరికి మైదానంలో మొదటి నిర్ణయం మాత్రం అంపైర్‌దేనని అంతా గుర్తిస్తున్నారు.