IPL 2027 CSK Trade News: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులోకి తీసుకుంటుందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. గత ఎనిమిది సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్‌ను ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే ఆసక్తి చూపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ హనుమ విహారి సీఎస్కేకు కీలక సూచన చేశాడు. అక్షర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా బలోపేతం అవుతుందన్నాడు. అయితే అక్షర్ కోసం ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను వదులుకంటే.. సీఎస్కే భారీ మూల్యం చెల్లించక తప్పదని అని హెచ్చరించాడు.
‘గత సీజన్లో సీఎస్కేకు ఆరో, ఏడో స్థానాల్లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవసరం కూడా ఉంది. ప్రశాంత్ వీర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. అయితే అక్షర్‌ను తీసుకునే క్రమంలో నూర్ అహ్మద్‌ను మాత్రం వదులుకోవద్దు. నూర్‌ను ట్రేడ్‌లో భాగంగా ఇచ్చేయడం సీఎస్కేకు ప్రతికూల నిర్ణయం అవుతుంది. అతడితో పాటు అక్షర్ ఉంటే చెన్నైలోని చెపాక్ పిచ్‌పై ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు’ అని హనుమ విహారి పేర్కొన్నాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో నూర్ అహ్మద్‌ను సీఎస్కే రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.
‘డెవాల్డ్ బ్రెవిస్‌ను వదులుకోవడం కూడా సీఎస్కేకు కఠినమైన నిర్ణయమే. అయితే అక్షర్‌ను జట్టులోకి తీసుకోవాలంటే బ్రెవిస్‌ను ట్రేడ్ చేయక తప్పదు. ఇప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్‌ను తీసుకున్నందున బ్రెవిస్ విషయంలో సీఎస్కే ఆలోచించవచ్చు. అక్షర్ వస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండూ బలపడతాయి. లివింగ్‌స్టోన్ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు. చెపాక్‌లో నూర్, అక్షర్ కలిసి బౌలింగ్ చేస్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది’ అని హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.
అక్షర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025కు ముందు అతడికి జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే అతడి నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. ఐపీఎల్ 2026లో వ్యక్తిగతంగానూ అక్షర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఢిల్లీలో కొత్త మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఐపీఎల్ 2027కు ముందు జట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా, యువరాజ్ సింగ్ సహాయక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 16న జరగనున్న ఐపీఎల్ 2027 వేలానికి ముందు అక్షర్ పటేల్ ట్రేడ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

