Hardik Pandya CSK Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ట్రేడ్ చేసే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సీఎస్‌కేకు వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తిగా ఉన్నా.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని ఓ కండిషన్ పెట్టినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్ పాండ్యాను సీఎస్‌కేకు పంపించేందుకు ముంబై ఇండియన్స్ ముగ్గురు ఆటగాళ్లను కోరే అవకాశం ఉందని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఒక్కడినే ఇచ్చి.. హార్దిక్‌ను సొంతం చేసుకోవడం ముంబైకి ఆమోదయోగ్యం కాకపోవచ్చని పేర్కొన్నాడు. ‘హార్దిక్ కోసం ముంబై ఇండియన్స్ కేవలం శివమ్ దూబేను మాత్రమే అంగీకరించకపోవచ్చు. దూబేతో పాటు ఆయుష్ మాత్రేను కూడా అడిగే అవకాశం ఉంది. ఇతర జట్ల నుంచి వచ్చే ప్రతిపాదనలను అధిగమించాలంటే సీఎస్‌కే ముగ్గురు ఆటగాళ్లతో కూడిన భారీ ఆఫర్ ఇవ్వాల్సి రావచ్చు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్ ఎక్స్ పీడాగ్’లో అభిప్రాయపడ్డాడు.
19 ఏళ్ల ఆయుష్ మాత్రేను, లిస్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను సీఎస్‌కే వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చని ఆర్ అశ్విన్ విశ్లేషించాడు. అందుకే ముంబైకి ఉపయోగపడే మరో ప్రత్యామ్నాయ ప్యాకేజీని సూచించాడు. శివమ్ దూబేతో పాటు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్, వికెట్‌కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను ఇచ్చే ప్రతిపాదనను పరిశీలించవచ్చని పేర్కొన్నాడు. ఎల్లిస్ రాకతో ముంబై బౌలింగ్ విభాగానికి, ముఖ్యంగా డెత్ ఓవర్లలో అదనపు బలం చేకూరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉర్విల్ చేరికతో వికెట్‌కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ ప్రత్యామ్నాయం లభించవచ్చు. మరో పెద్ద ప్రతిపాదనగా దూబే, ఎల్లిస్, ఉర్విల్ పటేల్‌తో పాటు మరో పేసర్‌ను ముంబైకి ఇచ్చి, బదులుగా హార్దిక్ పాండ్యాతో పాటు దీపక్ చహర్‌ను తీసుకునే అవకాశాన్ని కూడా అశ్విన్ ప్రస్తావించాడు.
హార్దిక్ పాండ్యా కోసం సీఎస్‌కే మాత్రమే కాకుండా మరో మూడు ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. కేకేఆర్ తరఫున స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ హర్షిత్ రాణాలను కలిపి ఆఫర్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఓపెనర్ యశస్వి జైస్వాల్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ల పేర్లు చర్చలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పంజాబ్ కింగ్స్ మాత్రం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌లతో కూడిన ప్యాకేజీని పరిశీలించవచ్చని సమాచారం. చూడాలి మరి హార్దిక్ ఐపీఎల్ 2027లో ఏ జట్టుకు ఆడుతాడో.

