NTV Telugu Site icon

IPL 2022: వచ్చే IPLకి ముందే శంకరన్నతో పాటు ఆ ఇద్దరిని వదిలేయనున్న గుజరాత్ టైటాన్స్..

0503282b Gujarat Vs Delhi

0503282b Gujarat Vs Delhi

IPL 2022 సీజన్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంచలన ప్రదర్శనతో లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించింది.

ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో ప్లేయర్ సత్తా చాటడంతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్.. కీలక ఫైనల్లో హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏకపక్షంగా టైటిల్ కైవసం చేసుకుంది. అయితే వచ్చే సీజన్‌లో కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్న ఆ జట్టు..పేలవ ప్రదర్శన కనబర్చిన ముగ్గురి ఆటగాళ్లను వదులుకోవాలనుకుంటుంది. మరి వారెవరో చూద్దామా..

1. విజయ్ శంకర్

IPL 2022 సీజన్‌లో ఆల్‌రౌండర్ ట్యాగ్‌ ఉండటంతో విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.కోటి 40 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతనిపై అంతే నమ్మకంతో టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించి, నెంబర్ 3 బ్యాటర్‌గా పంపించింది. కానీ శంకరన్న మాత్రం తనదైన శైలిలోనే దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 4, 13,2, 0 తో కేవలం 19 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 9 బంతులు మాత్రమే వేసి వికెట్ తీయకుండా 15 పరుగులిచ్చాడు.

2. మాథ్యూ వేడ్

T20 ప్రపంచకప్‌లో సత్తా చాటి ఆస్ట్రేలియాకు టైటిల్ అందించిన మాథ్యూ వేడ్‌ను గుజరాత్ టైటాన్స్ మెగా వేలంలో పోటీపడి మరీ రూ.2.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆరంభంలో స్పెషలిస్ట్ కీపర్ సాహాను కాదని మాథ్యూవేడ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఆరంభంలో ఓపెనర్‌గా ఆడించింది. కానీ అతను మాత్రం జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో అతన్ని కొన్ని మ్యాచ్‌లకు పక్కపెట్టిన గుజరాత్.. సాహాను ఓపెనర్‌గా ఆడించింది. ఆ తర్వాత మళ్లీ వేడ్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపించింది. కానీ అతను మాత్రం రాణించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 15.7 సగటులతో 157 పరుగులు మాత్రమే చేశాడు.

3. వరున్ ఆరోన్..

భారత వెటరన్ పేసర్ వరున్ ఆరోన్‌ను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్.. అతనికి తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించింది. రెండు వికెట్లు తీసిన ఆరోన్.. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతన్ని తప్పించిన గుజరాత్ బెంచ్‌కే పరిమితం చేసింది.