Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్.. SENA దేశాల్లో తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత.. మరో రికార్డు కూడా బ్రేక్..!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ పలు రికార్డులు నెలకొల్పింది.. ఇక, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. నవంబర్ 22న మ్యాచ్ నాలుగో రోజు పంత్ తన కెరీర్‌లో తొమ్మిదో టెస్ట్ శతకాన్ని పూర్తి చేశాడు. 135 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్న అతను.. మొత్తం 153 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు.

SENA దేశాల్లో అరుదైన రికార్డు..
ఈ సెంచరీతో రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. SENA దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి విదేశీ వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఈ దేశాల్లో తన తొలి టెస్ట్ సెంచరీ సాధించిన పంత్.. ఆ తర్వాత 2019లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో అజేయంగా 159 పరుగులు చేశాడు. 2022లో దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్‌లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. అదే ఏడాది ఇంగ్లాండ్‌పై బర్మింగ్‌హామ్‌లో 146 పరుగులతో చెలరేగాడు. 2025లో లీడ్స్ టెస్టులో 134, 118 పరుగులతో రెండు సెంచరీలు నమోదు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌పై 128 పరుగులతో మరో మైలురాయిని అందుకున్నాడు.

మెక్కల్లమ్ రికార్డు బద్దలు..
మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ పంత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉన్న 107 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. పంత్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో 108 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మెక్కల్లమ్ 107 సిక్సర్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. ఈ ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3,000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ఇది అతనికి తొమ్మిదో సెంచరీ. ఈ విషయంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (17), ఆండీ ఫ్లవర్ (12) మాత్రమే పంత్ కంటే ముందున్నారు.

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన..
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కంటే ముందుగా భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ 85, కేఎల్ రాహుల్ 136, దేవదత్ పడిక్కల్ 80, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 98 పరుగులు సాధించారు. విదేశీ గడ్డపై టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ తొలిసారిగా 600 పరుగుల మార్కును దాటింది. గతంలో 1999లో అహ్మదాబాద్ టెస్టులో 7 వికెట్ల నష్టానికి 583 పరుగులు చేయడమే అత్యధిక స్కోరుగా ఉంది.