2022 వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బీజింగ్ సిద్ధమయింది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. బీజింగ్‌ను జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్సన్ పట్టుకుంది. ఒమిక్రాన్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కట్టడి చేసేందుకు ఇప్పటికే బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాలలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరాలని చైనా పట్టుబడుతున్నది. ఇదిలా ఉంటే, బీజింగ్‌కు సమీపంలో ఉన్న షియాన్ నగరంలో ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
Read: న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం…19 మంది మృతి…
అయితే ఇప్పుడు టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో టియాంజిన్ నగరంలోని 1.4 కోట్ల మంది జనాభాకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరంలోని మొత్తం జనాభాకు సోమవారం వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయాలని అదేశించింది. బీజింగ్, టియాంజిన్ మధ్య ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు టియాంజిన్ నగరంలో కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, వింటర్ ఒలింపిక్స్‌లో ఎన్ని దేశాల క్రీఢాకారులు పాల్గొంటారు అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.