NTV Telugu Site icon

Rohit Sharma: ‘వాస్తవాలు చూపించండి’.. బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ అసహనం

Cricket Asia Uae Ind Sri

Cricket Asia Uae Ind Sri

టీమిండియా అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాస్తవాలను చూపించాలని మండిపడ్డాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (85 బంతుల్లో 101) సెంచరీతో అదరగొట్టాడు. మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శతకాన్ని అందుకున్నాడు. 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి సారిగా సెంచరీ బాదిన హిట్‌మ్యాన్.. ఇన్నాళ్లకు మరో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ పదే పదే చూపించింది. అయితే తన వన్డే సెంచరీకి మూడేళ్లు పట్టిందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ ప్రచారం చేయడాన్ని రోహిత్ శర్మ తప్పుబట్టాడు. ఈ మూడేళ్లలో తాను ఆడింది 12 వన్డేలు మాత్రమే అనే విషయాన్ని ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు.

Virat Kohli: కోహ్లీ కంటే నేనే బెటర్: పాక్ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్

న్యూజిలాండ్‌తో మూడో వన్డే అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. ఈ సమయంలో సెంచరీ చేయడానికి మూడేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందని ఓ జర్నలిస్ట్ హిట్‌మ్యాన్‌ను అడిగాడు. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ స్టార్ స్పోర్ట్స్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూడేళ్ల కాలంలో తాను 12 వన్డేలు మాత్రమే ఆడాననే విషయాన్ని అందరు గుర్తించాలని కోరాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ చూపించకపోవడంపై మండిపడ్డాడు. “ఈ మూడేళ్లలో నాకు ఇది తొలి సెంచరీ. ఈ సమయంలో నేను ఆడింది 12 వన్డేలు మాత్రమే. మూడేళ్లు అనేది చాలా ఎక్కువ కాలంగా వినిపిస్తోంది. క్రికెట్ జర్నలిస్ట్‌లుగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి.మూడేళ్ల తర్వాత సెంచరీ అని బ్రాడ్‌‌కాస్టర్ చూపించిందనే విషయం తెలుసు. కానీ బ్రాడ్ కాస్టర్ వాస్తవాలు కూడా చూపించాలి. నిరుడు మేం వన్డే క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొవాలి. బ్రాడ్‌కాస్టర్ నిజాలను మాత్రమే చూపించాలి” అని హిట్‌మ్యాన్ గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగులతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా అందుకుంది రోహిత్‌సేన.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన జాబితాలో రోహిత్.. రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. 365 ఇన్నింగ్స్‌ల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు చేయగా.. రోహిత్ 234 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 49(452 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్ కోహ్లీ 46 (261 ఇన్నింగ్స్‌ల్లో) ముందున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.