NTV Telugu Site icon

Commonwealth Games 2022: అదరగొట్టిన భారత్‌.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు..

Cwg 2022 Ind

Cwg 2022 Ind

కామన్‌వెల్త్ గేమ్స్‌ చివరిదశకు చేరిన వేళ భారత ఆటగాళ్లు అదరగొట్టారు. భారత బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయారు. ఒకే రోజు బాక్సింగ్‌లో మూడు స్వర్ణాలను భారత్ గెలుచుకుంది. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్ స్వర్ణం సాధించింది. 48-50 కేజీల విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇక, పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌ కూడా బంగారు పతకాలు సాధించారు. టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌-శ్రీజ ఆకుల జోడీ సత్తా చాటింది. ఫైనల్‌లో 3-1తో మలేషియాకు చెందిన జావెన్‌-కరెన్‌ లైన్‌ను ఓడించి స్వర్ణం సాధించారు.

Read Also: CWG 2022: ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి.. చేజారిన పసిడి..

పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలోనూ భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. ఎల్దోస్‌ పాల్‌ 17.03మీటర్లు దూకి గోల్డ్‌ సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. మరోవైపు అబ్దుల్లా అబూబకర్‌ 17.02 మీటర్లు దూకి సిల్వర్ మెడల్ సాధించాడు. అటు 10వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ సత్తా చాటి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్ను రాణి మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం కైవసం చేసుకుంది.

ఇక బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. ఉమెన్స్‌ సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఫైనల్‌కు చేరారు. ఇవాళ ఇద్దరూ ఫైనల్‌ ఆడబోతున్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. సింగపూర్ ఆటగాడు జియాహెంగ్‌ పై గెలిచి కాంస్యం దక్కించుకున్నాడు. కామన్వెల్త్‌లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్‌ నుంచి పసిడి చేజారింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ పోరులో భారత్‌ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. మొత్తంగా.. కామన్వెల్త్‌లో భారత్‌ 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. నేటితో కామెన్‌వెల్త్ గేమ్స్ ముగియనున్న విషయం తెలిసిందే.