INDW vs SLW Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు మరికొన్ని గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఉత్కంఠభరితమైన విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక తుది పోరుకు చేరుకుంది. ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకోవాలని లంక చూస్తోంది.
ఇప్పటివరకు ఏడు టైటిళ్లు:
మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏకంగా ఏడు టైటిళ్లను టీమిండియా గెలుచుకుంది. ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. శ్రీలంకను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. 2024లో దంబుల్లాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ విజయం ఫైనల్‌కు ముందు లంక జట్టుకు అదనపు ఆత్మవిశ్వాసాన్ని అందించనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
షఫాలీ వర్మపైనే భారం:
ఈ టోర్నీలో భారత్ తరఫున ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు 168 పరుగులు చేసిన ఆమె.. రెండు అర్ధ సెంచరీలు కూడా నమోదు చేసింది. దీంతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో షఫాలీ అగ్రస్థానంలో ఉంది. స్లో పిచ్‌లపై భారత బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. షఫాలీ మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా తన దూకుడైన ఆటను కొనసాగిస్తోంది. స్మృతి మంధాన చెలరేగాలని ఫాన్స్ ఆశిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రతీక రావల్, రిచా ఘోష్ ఫైనల్లో అయినా రాణిస్తారేమో చూడాలి. స్పిన్‌లో భారత్‌కు తిరుగులేదు. దీప్తి శర్మ, శ్రీచరణి, ప్రేమ రావత్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పేసర్లు నందని, క్రాంతి బాగా బౌలింగ్ చేస్తున్నారు.
హెడ్ టు హెడ్:
టీ20 ఫార్మాట్‌లో ముఖాముఖి గణాంకాల్లో శ్రీలంపై టీమిండియాదే ఆధిపత్యం. ఇప్పటివరకు ఇరు జట్లు 31 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శ్రీలంక ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించిన లంక.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్.. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్న శ్రీలంక హోరాహోరీగా తలపడనున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్:
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ భారత్, శ్రీలంక మధ్య ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ టైటిల్ పోరుకు వేదిక కానుంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ప్లేయింగ్ 11:
భారత్: స్మృతి, షెఫాలి, ప్రతీక, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), భార్తీ, రిచా, దీప్తి, శ్రీచరణి, ప్రేమ, నందని, క్రాంతి
శ్రీలంక: చమరి, ఇమేషా, హర్షిత, సంజన, హాసిని, కౌశిని, కవిశ, నీలాక్షిక, సుగందిక, ప్రబోద, మిథాలి.

