Site icon NTV Telugu

వరుణుడి దోబూచులాట.. రెండో రోజు నిలిచిన ఆట

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా నాలుగు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు.

read also : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటిపైనే చర్చ

ఫేస్‌ చేసిన ఫస్ట్‌ బాల్‌కే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక అజింక్య రహానే కూడా రాణించ లేకపోయాడు. 5 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఫలితంగా 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఇబ్బందులో పడినట్టు కనిపించింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసిన రిషభ్ పంత్ నిదానంగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ సమయంలో మేఘాలు దట్టంగా కమ్మేసి వెలుతురు మందగించడంతో ముందుగానే టీ బ్రేక్ ప్రకటించారు. ఆ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రాహుల్ 57, పంత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Exit mobile version