India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!

India A Vs Sri Lanka A

India A Vs Sri Lanka A

India A vs Sri Lanka A: శ్రీలంకలో జరుగుతున్న 2026 ట్రై-సిరీస్ వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ జట్టు సంచలన విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఒక దశలో శ్రీలంక విజయం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో.. భారత బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్‌ను ఇండియా వైపు మలుపు తిప్పారు.

రుతురాజ్ క్లాస్ సెంచరీ..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (14) నిరాశపరచగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) వెంటనే అవుట్ కావడంతో భారత్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ప్రియాన్ష్ ఆర్య (32) రనౌట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న జట్టును వైస్ కెప్టెన్ రుతురాజ్, కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతంగా పోరాడారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు ఏకంగా 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ 112 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ (101) మార్క్‌ను అందుకున్నాడు. శతకం పూర్తి కాగానే వానుజా సహాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 60 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఆయుష్‌ బధోని (24; 18 బంతుల్లో, 2 ఫోర్లు) సూర్యాంశ్‌ షిడ్జే (26*; 14 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో ఆయుష్‌ బధోని ఔటయ్యాడు. అనుకుల్‌ రాయ్‌ (1*) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మహ్మద్‌ షిరాజ్‌ 2, చమిక కరుణ రత్నే, వనుజ సహాన్‌, గరుక సంకేత్ తలో వికెట్‌ తీసుకున్నారు.

×
×
Ad

చేతికందిన విజయాన్ని చేజార్చుకున్న లంక..

278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టుకు ఓపెనర్లు గట్టి పునాది వేశారు. నిరోషన్ డిక్వెల్లా (47), అవిష్క ఫెర్నాండో (45), సదీర సమరవిక్రమ (46) రాణించడంతో లంక బలమైన స్థితిలో నిలిచింది. మధ్యలో వచ్చిన లంక కెప్టెన్ సహాన్ అరచ్చిగే 72 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి జట్టును విజయం అంచుల్లోకి చేర్చాడు. శ్రీలంక విజయానికి 10 బంతుల్లో 9 పరుగులు కావాలి, చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో 48వ ఓవర్లో భారత పేసర్ అన్షుల్ కంబోజ్.. ప్రమాదకరంగా మారిన లంక కెప్టెన్ సహాన్ అరచ్చిగేను అవుట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఒత్తిడిలో లంక లోయర్ ఆర్డర్ తడబడింది. వానుజా సహాన్ (23) రనౌట్ అవ్వగా, మహ్మద్ షిరాజ్ డకౌట్ అయ్యాడు. దీనితో శ్రీలంక ‘ఎ’ జట్టు 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.