New Zealand playing 11 vs India: భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తమ జట్టు కూర్పుపై కీలక విషయాలు వెల్లడించాడు. తొలి టెస్టులో ముగ్గురు పేసర్లు, ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టిక గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. తమదైన శైలిలో క్రికెట్ ఆడటంపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలిపాడు. తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన లాథమ్.. ‘ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో ఆడతాం’ అని చెప్పాడు.
మాట్ హెన్రీ, కైల్ జేమీసన్ కివీస్ పేస్ దళంలో కీలకంగా ఉండనున్నారు. మూడో పేసర్ ఎవరనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. హెన్రీ అందుబాటులో ఉండటం పట్ల లాథమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-3తో ఓడిపోయింది. ఆ సిరీస్ సందర్భంగా కంకషన్‌కు గురైన హెన్రీ.. కోలుకుని తిరిగి టెస్టు ఫార్మాట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ‘హెన్రీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో రాణించేందుకు అతడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని లాథమ్ తెలిపాడు.
కైల్ జేమీసన్ కూడా గత కొన్ని వారాలుగా జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడని కివీస్ కెప్టెన్ చెప్పాడు. ఇటీవల వైట్ బాల్ మ్యాచ్‌ల్లో అతడు బౌలింగ్ చేసిన తీరు బాగుందని ప్రశంసించాడు. ‘జేమీసన్ గత రెండు వారాలుగా ఎంతో కష్టపడుతున్నాడు. అతడు చాలా శ్రమించాడు. వైట్ బాల్ మ్యాచ్‌ల్లోనూ బాగా బౌలింగ్ చేశాడు’ అని లాథమ్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికపై కూడా న్యూజిలాండ్ కెప్టెన్ స్పందించాడు. ప్రస్తుతం ఈ సైకిల్‌లో ఆరు టెస్టులు ఆడి నాలుగు విజయాలు, ఒక ఓటమితో కివీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు భారత్ నాలుగో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో టీమిండియాకు విజయాలు కీలకం కానున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో స్థానాల గురించి ఆలోచించడం తన ప్రాధాన్యం కాదని లాథమ్ స్పష్టం చేశాడు. ‘డబ్ల్యూటీసీ పట్టిక ప్రస్తుతం నా దృష్టిలో లేదు. మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా ఆటతీరుకు అనుగుణంగా క్రికెట్ ఆడుతూ, విజయానికి అవసరమైన అవకాశాలను సృష్టించుకుంటాం’ అని చెప్పాడు.

