Site icon NTV Telugu

IND vs NZ Final 2026: నేడు భారత్, న్యూజిలాండ్‌ ఫైనల్‌.. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

Sam

Sam

IND vs NZ Final 2026 Playing 11: నేడు టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 నుంచి ఆరంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారైన న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై కప్పు కోసం తలపడబోతోంది. అందులోనూ చేదు జ్ఞాపకాలకు వేదికైన అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండడం టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా కివీస్‌పై టీమిండియా ఒక్కసారీ గెలవలేదు. చరిత్ర భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నా.. సూర్యకుమార్‌ సేన కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి చూద్దాం.

భారత్ ఒక మార్పు:
ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. భారీగా రన్స్ ఇస్తున్న వరుణ్‌ చక్రవర్తి స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మన తప్పిస్తారని వార్తలు వచ్చినా.. మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్‌, హార్దిక్, దూబెలు ఫామ్ మీదుండడం కలిసొచ్చే అంశం. అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రాలు మరోసారి రాణిస్తే తిరుగుండదు. మరోవైపు కివీస్‌ పటిష్టంగా ఉంది. అలెన్‌, సీఫర్ట్‌ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. రచిన్‌, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్‌లతో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. శాంట్నర్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ రూపంలో టాప్ పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలో స్టార్స్ ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

హెడ్ టు హెడ్:
టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో (2007, 2016, 2021)లో భారత్‌ ఓడిపోయింది. భారత్, న్యూజిలాండ్‌ అంతర్జాతీయ టీ20ల్లో 30 సార్లు ఢీకొన్నాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే.. 11 మ్యాచ్‌ల్లో కివీస్‌ నెగ్గింది. ఇక 3 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

పిచ్ రిపోర్ట్:
ఎర్రమట్టి, నల్లరేగడి మట్టితో పిచ్‌ను సిద్ధం చేశారు. పేస్, బౌన్స్‌ కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. భారీ స్కోరు వెళ్లే అవకాశం ఉంది. స్పిన్‌కు పెద్దగా సహకరించకపోవచ్చు. గత ఎనిమిది మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షంతో ఆదివారం మ్యాచ్‌ సాధ్యం కాకపోతే.. రిజర్వ్‌ డే సోమవారం నిర్వహిస్తారు.

తుది జట్లు (అంచనా):
భారత్‌: అభిషేక్, సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్, దూబె, అక్షర్, వరుణ్‌/కుల్‌దీప్‌, అర్ష్‌దీప్, బుమ్రా.
న్యూజిలాండ్‌: సీఫర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్‌ (కెప్టెన్‌), మెకాంకీ, నీషమ్‌/డఫీ, హెన్రీ, ఫెర్గూసన్‌.

 

Exit mobile version