విరాట్ కోహ్లీ.. ప్రస్తుత తరంలో నెంబర్ వన్ క్రికెటర్ అని చెప్పొచ్చు. రికార్డులతో పోటీపడుతూ పరుగులు పెడుతున్న అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దిగ్గజాల సరసన నిలిచేందుకు అతడు నమోదు చేస్తున్న గణాంకాలను చూస్తేనే తెలుస్తోంది కోహ్లీ ప్రతిభ ఏంటో. అలాంటి కోహ్లీ కంటే కూడా తాను మెరుగైన ఆటగాడనంటూ ఓ పాకిస్తాన్ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లిస్ట్-ఏ కెరీర్‌లో కోహ్లీ కంటే మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చానని, కానీ సెలక్టర్లు పదే పదే తనను విస్మిరిస్తున్నారని తెలిపాడు. ఆ పాక్ క్రికెటర్ పేరు ఖుర్రం మంజూర్. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2008లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. దాయాది జట్టు తరఫున 26 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 16 టెస్టులు ఉండగా.. ఏడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. ఈ మూడు టీ20ల్లో ఓ మ్యాచ్‌లో కోహ్లీ, ఖుర్రం ఇద్దరూ ఆడారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ.. అతడిని 10 పరుగుల వద్ద సూపర్ రనౌట్ చేశాడు.
Team India: సూర్యకుమార్ రికార్డు.. అత్యంత వేగంగా 100 సిక్సర్ల ఘనత
“నేను విరాట్ కోహ్లీతో పోల్చుకోవట్లేదు. వాస్తవాలు మాత్రమే చెబుతున్నా. వన్డే క్రికెట్‌లో టాప్-10 ఎవరైనా కానీ ప్రపంచ నెంబర్ వన్‌ను మాత్రం నేనే. నా తర్వాత కోహ్లీ ఉంటాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అతడికంటే మెరుగైన గణాంకాలు నాకున్నాయి. అతడు ప్రతి ఆరు ఇన్నింగ్స్‌కు ఓ సెంచరీ చేశాడు. కానీ నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌కే శతకం నమోదు చేశా. పదేళ్లుగా నా సగటు 53గా ఉంది. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నా. 2015 నుంచి ఇప్పటి వరకు ఆడిన 48 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు బాదాను. పాక్ తరఫున ఎవరు ఓపెనింగ్ చేసినా ఇప్పటికీ నాదే లీడింగ్ స్కోరు. నేషనల్ టీ20లో టాప్ స్కోరు చేశాను, అలాగే సెంచరీ సాధించా. అయినా నన్ను పక్కన పెట్టారు. ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు” అని ఖుర్రం ఆవేదన వ్యక్తం చేశాడు.
Sourav Ganguly: తన బయోపిక్ తానే రాస్తున్న గంగూలీ..స్క్రిప్ట్ ఫైనల్
లిస్ట్-ఏ క్రికెట్‌లో మంజూర్ 166 మ్యాచ్‌లు ఆడి 7,992 రన్స్ చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ప్రతి 6.11 ఇన్నింగ్స్‌కు ఓ శతకం నమోదు చేశాడు. అతడి సగటు వచ్చేసి 53.42గా ఉంది. ప్రస్తుతం లిస్ట్-ఏ క్రికెటర్లలో ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ 294 ఇన్నింగ్స్‌లో 14,215 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలు ఉన్నాయి. ప్రతి 5.88 ఇన్నింగ్స్‌కు ఓ సెంచరీ చొప్పున కోహ్లీ చేశాడు.