Site icon NTV Telugu

Andrea Jaeger: మద్యం తాగించి.. 30 సార్లు లైంగికంగా వేధించారు

Andrea Jaeger

Andrea Jaeger

మహిళలకు ఏ రంగంలోనూ భద్రత లేదు. కాటు వేయడానికి కామాంధులు ప్రతీ చోటా కాచుకొని ఉంటారు. మహిళల బలహీనతల్ని అదునుగా మార్చుకొని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. తానూ అలాంటి వేధింపులకు గురైన బాధితురాలినేనంటూ తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ ఆండ్రియా జేగర్ బాంబ్ పేల్చింది. తనపై 30కి పైగా సందర్భల్లో లైంగిక దాడులు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టింది.

‘‘1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన స్టాఫ్ మెంబర్ ఒకరు నాపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో ప్రముఖుడు, నాకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. అది తన కెరీర్ ప్రారంభం కాబట్టి, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక లోలోపలే మదన పడ్డాను’’ అని ఆండ్రియా పేర్కొంది. అంతేకాదు.. లాకర్ రూమ్ లో కూడా తనని వేధించారంది. ఓ మహిళ తనను ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిందని, ఆ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటావంటూ ఆమె బెదిరించిందని తెలిపింది. కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న వేధింపులు అన్నీ ఇన్నీ కావంటూ 57 ఏళ్ల ఆండ్రియా జెగర్ తన ఆవేదన చెప్పుకొచ్చింది.

కాగా.. 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో ఆండ్రియా జేగర్‌ స్టార్‌ ప్లేయర్‌గా గుర్తింపు గడించింది. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 10కి పైగా టైటిళ్లు సాధించిన ఈమె కెరీర్.. భుజం గాయం కారణంగా అర్ధంతరంగా ముగిసింది. ఇప్పుడు లైంగిక వేధింపుల వ్యాఖ్యలతో ఇన్నాళ్ల తర్వాత వార్తల్లోకెక్కింది.

Exit mobile version