NTV Telugu Site icon

IND vs NZ: ఇవేం పిచ్‌లు.. మరీ ఇంత చెత్తగా ఉన్నాయ్: హార్దిక్

Hardik

Hardik

భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ చప్పగా సాగింది. టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా స్లో ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లున్నా ఒక్క సిక్స్ కూడా నమోదవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇదే విషయమై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ క్యూరేటర్లపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఇవేం పిచ్‌లు అంటూ మండిపడ్డాడు. మ్యాచే కాదు తొలి మ్యాచ్ పిచ్ కూడా అలాగే ఉందని, తాము ఆడబోయే స్టేడియాల్లో పిచ్‌లను ముందుగానే తయారు చేసేలా చూడాలని అన్నాడు.

“నిజాయతీగా చెప్పాలంటే ఈ పిచ్ చాలా దారుణంగా ఉంది. ఈ సిరీస్‌లో మేం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే పరిస్థితి. క్లిష్టమైన వికెట్లు అయితే పర్వాలేదు. ఆ సవాలుకు సిద్ధం. కానీ ఈ రెండు పిచ్‌లు అసలు టీ20ల కోసం తయారు చేసినవైతే కావు. మేము ఆడబోయే గ్రౌండ్లలో పిచ్‌లను చాలా ముందుగానే సిద్ధం చేసేలా క్యూరేటర్లు చూస్తే బాగుంటుంది. లక్నోలోని పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించింది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టంగా అనిపించింది. రెండు జట్లలోని హిట్టర్లు కూడా ఈ పిచ్‌పై బౌలర్లకు తలవంచాల్సి వచ్చింది. ఈ పిచ్‌పై 120 కూడా గెలిచే లక్ష్యమే. మా బౌలర్లు తమ ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయకుండా చూశారు. స్పిన్నర్లను మార్చిమార్చి బౌలింగ్ చేయించాం. పొగమంచు ప్రభావం పెద్దగా లేదు. వాళ్లు మా కంటే బాగా స్పిన్ చేయగలిగారు. కానీ పిచ్ మాత్రం నిజంగా షాక్ కు గురి చేసింది” అని హార్దిక్ స్పష్టం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేయగా.. మూడో టీ20 బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్‌లో జరగనుంది.