Hardik Pandya Trade: హార్దిక్‌ పాండ్యా ట్రేడ్‌ రూమర్స్‌.. ముంబై ఇండియన్స్‌ పోస్ట్‌ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?

Mi Post Hardik Pandya Pics

Mi Post Hardik Pandya Pics

Mumbai Indians Post Hardik Pandya Pics: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్‌ చేయనుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీంలోకి వెళ్లేందుకు హార్దిక్‌ సముఖంగా ఉన్నాడంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై ప్రాంచైజీ తన సోషల్‌ మీడియాలో హార్దిక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేయడం ఇప్పుడు క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

హార్దిక్‌ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన హార్దిక్‌.. 2022 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులోకి వెళ్లాడు. తొలి సీజన్‌లోనే టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత సీజన్‌లో కూడా గుజరాత్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. 2024లో హార్దిక్‌ను ముంబై ట్రేడింగ్‌ విండో ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది. ముంబైకి తిరిగి వచ్చిన హార్దిక్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే అతడి నాయకత్వంలో 2024 జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్‌-2 వరకు చేరుకున్నప్పటికీ.. 2026 సీజన్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ చేసే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌ ట్రేడింగ్‌ విండోకు సంబంధించిన చర్చలు జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పోస్టు ద్వారా హార్దిక్‌ ట్రేడ్‌పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. ‘హార్దిక్‌ ఎక్కడికి వెళ్లడం లేదు, ముంబైలోనే ఉంటాడు’ అని ఎంఐ చెప్పకనే చెప్పింది. ముంబై పోస్ట్‌పై అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ముంబైలోనే హార్దిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హార్దిక్‌ ట్రేడ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్‌ మీడియా పోస్టుతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైనప్పటికీ.. హార్దిక్‌ ముంబైలోనే కొనసాగుతాడా? లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.