Legends League Cricket: గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన చెంపదెబ్బ ఘటన కారణంగా టీమిండియా క్రికెటర్లు హర్భజన్, శ్రీశాంత్ మధ్య దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత చాన్నాళ్లకు వీళ్లిద్దరూ ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడటం ఆసక్తి రేపింది. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కారణంగా ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్, శ్రీశాంత్ నవ్వుతూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ వేడుకల్లో భాగంగా వరల్డ్ జెయింట్స్, ఇండియా మహరాజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో శ్రీశాంత్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా మహరాజస్‌కు హర్భజన్ ప్రాతినిథ్యం వహించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో హర్భజన్, శ్రీశాంత్ కలిసి ఆడిన జట్టు గెలవడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రైన్ (31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. అటు దినేష్ రామ్‌దిన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) తన వంతు సహకారం అందజేశాడు. ఇండియా మహరాజాస్ బౌలర్లలో పంకజ్ సింగ్ ఐదు వికెట్లు సాధించాడు. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహహ్మద్ కైఫ్ తలో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు మూడు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం ఇండియా మహరాజాస్ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తన్మయ్ శ్రీవాస్తవ (39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 54), యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) రాణించారు.
